ఢిల్లీ మద్యం విధానం కేసులో నేరం జరిగినట్లు ఎటువంటి ఆధారం లేదని సిబిఐ ప్రత్యేక కోర్టు తేల్చి చెప్పింది. రూ. 100 కోట్లు చేతులు మారినట్లు చేస్తున్న ఆరోపణలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రుజువులు చూపలేకపోయిందని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ఈ డి అరెస్ట్ చేసిన రాజేష్ జోషి, గౌతమ్ మల్హోత్రాలకు ప్రత్యేక కోర్టు జడ్జి ఎంకే నాగ్ పాల్ రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బెయిల్ ఉత్తర్వుల్లో కీలక అంశాలను పొందుపరిచారు.
ఈ కేసులో నేరం జరిగిందా అని చెప్పడానికి ప్రాథమికంగా ఎటువంటి సాక్షాదారాలను ఈడి చూపించలేకపోయిందని పేర్కొన్నారు. నిందితులు నేరం చేశారని నిరూపించడానికి ఈడి సేకరించిన మౌఖిక మరియు డాక్యుమెంటరీ ఆధారాలు సరిపడా లేవని తెలిపారు. సౌత్ గ్రూపు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ రూ. 100 కోట్లు లంచాలు తీసుకొని గోవా ఎన్నికల ప్రచారానికి ఆ పార్టీ వినియోగించిందని, అందులో రాజేష్ జోషి ప్రమేయం కూడా ఉంది అని ఈడి ఆరోపిస్తున్నప్పటికీ ఆయన కంపెనీ నుంచి ఎటువంటి నగదును స్వాధీనం చేసుకోలేదని జడ్జి గుర్తించారు.
హవాలా మార్గం ద్వారా నగదు చేతులు మారిందని ఆరోపిస్తున్నా అందుకు తగిన సాక్షాదారాలు చూపించలేకపోయిందని జడ్జి నాగ్ పాల్ స్పష్టం చేశారు. ఈ లావాదేవీలకు సంబంధించి ఒక్క హవాలా ఆపరేటర్ వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేసి కోర్టుకి సమర్పించలేదని, హవాలా ఆపరేటర్ల నుంచి ఈడి కనీసం రికార్డులను కూడా స్వాధీనం చేయలేదని తేల్చిచెప్పారు.
అలాగే , వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రా లంచాలు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయలేదని బెయిల్ ఉత్తర్వుల్లో జడ్జి పేర్కొన్నారు. మద్యం విక్రయాలను పెంచుకోవడానికి గౌతమ్ మల్హోత్ర వ్యాపారపరంగా కార్టెల్ ను సృష్టించారు తప్పా ఎవరికి లంచాలు ఇవ్వలేదని, మద్యం విధానం రూపకల్పన లో ఆయనకు ఎటువంటి పాత్ర లేదని తెలిపారు.