Tuesday, November 26, 2024

పుర‌పాలిక‌ల‌లో ఆర‌ని కుంప‌ట్లు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ఇదివరకు ఎన్నడూ లేనివిధంగా పురపాలక సంస్థల్లో అవిశ్వాసాల పరంపర కొనసాగు తూనే ఉంది. దాదాపు నెల రోజుల క్రితం ప్రారంభమైన ఈ వ్యవహారం అన్ని జిల్లాలకు పాకింది. మొదట మేజర్‌ మునిసిపాలిటీల్లో మాత్రమే కనిపించిన అవిశ్వాసాల అలజడి నేడు నియోజకవర్గస్థాయి పాలకమండళ్ళ లోనూ కనిపిస్తోంది. అధికార పార్టీకి మెజార్టీ ఉన్నప్పటికీ.. కొన్నిచోట్ల అవినీతి, అక్రమాలు జరగడం, మరికొన్ని చోట్ల కౌన్సిలర్లు, చైర్మన్ల మధ్య అంతర్గత కలహాలు ఏర్పడడం లాంటి కారణాలతోరెండు వర్గాలుగా ఏర్పడి అవి శ్వాసాలు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలతో కలిసి క్యాంపులు నిర్వహించే ఏర్పాట్లు- కూడా చేసుకుంటు-న్నారు. నిర్మల్‌లో అదే జరిగింది. ఇప్పటివరకు అవిశ్వాస తీర్మానాలు చేసి, కలెక్టర్ల ఆమోదం కోసం పంపించిన వాటిల్లో మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌ నగరపాలక సంస్థ, రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట, ఇబ్రహిం పట్టణ పురపాలక సంఘం, వికారాబాద్‌ జిల్లా తాండూరు, యాదగిరి, జనగామ, ఆర్మూర్‌, హుజురాబాద్‌ మునిసిపాలిటీలు ఉండగా, తాజాగా మరిన్ని జతకలిశాయి.

తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్నపై వైస్‌ చైర్‌పర్సన్‌ పటోళ్ల దీప, మరో 15మంది కౌన్సిలర్లు కలిసి అవిశ్వాసం ప్రకటించారు. తాజాగా జగిత్యాల విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. చైర్‌పర్సన్‌ బోగ శ్రావణి బలవంతంగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే రాజకీయంతో జవహర్‌ నగర్‌ మేయర్‌తో పాటు- వికారాబాద్‌, తాండూరు, పెద్ద అంబర్‌పేట్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్లపై కూడా అవిశ్వాసం ప్రకటించారు. పెద్ద అంబర్‌పేటలో వైస్‌ చైర్‌పర్సన్‌పైనా అవిశ్వాస నోటీ-స్‌ ఇచ్చారు. పెద్ద అంబర్‌పేట్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చెవుల స్వప్న, వైస్‌ చైర్‌ పర్సన్‌ చామ సంపూర్ణపై బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌, సీపీఐ కౌన్సిలర్లు మూకుమ్మడిగా అవిశ్వాసం ప్రకటించారు. వికారాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిగుళ్లపల్లి మంజులను పదవి నుంచి దించాలని కోరుతూ 20మంది బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు శనివారం వికారాబాద్‌ కలెక్టర్‌కు అవిశ్వాసం నోటీ-సులు ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ చైర్‌పర్స్‌న్‌ ముత్యం సునీత, హుజూరాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక, ఖమ్మం జిల్లా ఇల్లందు మున్సిపల్‌ చైర్మన్‌ దమ్మలపాటి వెంకటేశ్వర్‌ రావు, సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి గుప్త తదితరులపై మెజారిటీ కౌన్సిలర్లు అవినీతి ఆరోపణలు చేస్తూ అవిశ్వాస తీర్మాణాలు చేశారు.

పురపాలక ఛైర్‌పర్సన్లు, నగరపాలక సంస్థల మేయర్లపై కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాలపై సమావేశాలు నిర్వహించాల్సిన గడువు సమీపిస్తుండటంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. నోటీ-సులు అందుకున్న నెల రోజుల వ్యవధిలో సమావేశం నిర్వహించాలన్నది నిబంధన. ఇప్పటివరకు మొత్తం వందకు పైగా పురపాలక ఛైర్‌పర్సన్లు, గరపాలక సంస్థల మేయర్లపై అవిశ్వాస తీర్మాన నోటీ-సులు వచ్చాయి. వీటిలో పది చోట్ల నెల రోజుల వ్యవధి వచ్చే నెల మొదటి వారంతో ముగియనుంది. ఆ గడువు సమీపిస్తుండటంతో స్టే ఉత్తర్వులు పొందేందుకు పలువురు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అవిశ్వాస తీర్మానాల ఆమోదం నిబంధనలను ఇంకా రూపొందించలేదని వాదనల సందర్భంగా న్యాయస్థానం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నెల 21వ తేదీలోగా నిబంధనలతో కూడిన అఫిడవిట్‌ దాఖలు చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.

కొత్త చట్టం కోసం ఎదురుచూపులు
పురపాలక సంఘాల ఛైర్‌పర్సన్లు, నగరపాలక సంస్థల మేయర్లపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు గతంలో మూడేళ్ల గడువు ఉండగా, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లకు పెంచింది. ఆమేరకు చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి.. చట్టబద్ధత కల్పించేందుకు గవర్నర్‌ ఆమోదం కోసం పంపింది. గవర్నర్‌ ఇంకా ఆమోదించకపోవడంతో గడువు పెంపు అమలులోకి రాలేదు. చట్ట సవరణ నేపథ్యంలో అవిశ్వాస తీర్మాన నిబంధనలను మున్సిపల్‌ వ్యవహారాల శాఖ ఇంతవరకు రూపొందించలేదు. అయితే.. బిల్లు ఇంకా గవర్నర్‌ ఆమోదం పొందని నేపథ్యంలో పాత చట్టం అమలులో ఉన్నట్లేనని నిపుణులు పేర్కొంటు-న్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల మేరకు మున్సిపల్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని అధికారులకు ఇవ్వాలంటే కనీసం 50 శాతం మంది కార్పొరేటర్లు సంతకాలతో నోటీ-సు ఇవ్వాలి. అవిశ్వాసం నోటీ-సు ఇచ్చిన 25నుంచి 30 రోజుల వ్యవధిలో ప్రత్యేక సమావేశం నిర్వహించాలి. మూడింట రెండొంతుల మంది సభ్యులు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేస్తేనే తీర్మానం ఆమోదం పొందుతుంది. ఈ నిబంధనలనే నూతన చట్టంలోనూ పేర్కొనాలని అధికారులు యోచిస్తున్నట్లు- సమాచారం. దీనిపై నిపుణుల అభిప్రాయాలనూ సేకరిస్తున్నారు. ఈ వారం చివరిలోగా నిబంధనలను రూపొందించి న్యాయస్థానంలో అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి.

- Advertisement -

అవకాశమే… ఆసరాగా
అవకాశమే అదునుగా పదవులను మునిసిపల్‌ చైర్మన్‌ పదవులను చేజిక్కించుకునేందుకు నాయకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గత నెల రోజులుగా స్థానిక సంస్థల్లో అవిశ్వాసాల అలజడి కొనసాగుతోంది. ఆర్థిక, భౌగోళిక వనరులు పుష్కలంగా ఉన్న చోట్ల ఈ వ్యవహారం మరింత కుట్రపూరితంగా కొనసాగుతోంది. కొన్నిచోట్ల చైర్మన్లు, వైస్‌ చైర్మన్‌ స్థానాల్లో ఉన్నవారు అక్రమాలకు పాల్పడిన సందర్బాలు బహిర్గతం కావడంతో అవిశ్వాసాలకు బీజం పడింది. మరికొన్ని చోట్ల పదవులపై ఆశలు పెంచుకున్న నాయకులు తమ పైస్థానంలో ఉన్నవారిని దింపే ప్రయత్నం చేస్తున్నారు. అంతర్గత ఒప్పందాలతో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టి పదవుల్లో పాగా వేసేందుకు ఎంతటి-కై-నా తెగబడుతున్నారు. ఈ క్రమంలో రాజకీయ ఆర్థిక లావాదేవీలు కూడా భారీగానే జరుగుతున్నాయి. పదవుల కోసం స్థాయిని బట్టి లక్షలు, కోట్లు- చేతులు మారుతున్నాయి.

చట్టం ఏం చెబుతోందంటే…
పురపాలక చట్టం ప్రకారం ఎన్నికల పక్రియ పూర్తి అయిన మూడేళ్ళ వరకు ఎలాంటి అవిశ్వాస తీర్మానాలకు అవకాశం లేదు. అయితే మూడేళ్ళ క్రితం అంటే 2020 జనవరి 27న సర్పంచ్‌, ఉపసర్పంచ్‌లు పదవులు చేపట్టి 2023 జనవరి 27కు మూడేళ్ళు పూర్తి అయింది. ఈ మూడేళ్ళ కాలంగా అంతర్గత విభేదాలున్నా ఓపిక పట్టిన అవిశ్వాసులకు ఒక్కసారే రెక్కలు వొచ్చినట్లు- అయింది. విచిత్రమేమంటే ఇందులో అధికార, ప్రతిపక్ష పార్టీలన్న భేదం లేకుండా అందరిపైన అవిశ్వాసాలు మొదలైనాయి. రాజ్యాంగపరంగా వచ్చిన పదవులను రాజకీయంగా మలుచుకోవడం, వక్తిగత లబ్ధికోసం పాకులాడడం, అభివృద్ధి పనుల్లో వాటాలు ఆశించడం లాంటికి ఇటీవలి కాలంలో స్థానిక సంస్థల్లో పరిపాటిగా మారుతున్నాయి. ఇప్పటివరకు అమల్లో ఉన్న చట్టం ప్రకారం అవిశ్వాసానికి మూడేళ్ళు ఆగాల్సి ఉంది. గత ఏడాది సెప్టెంబర్‌లో అసెంబ్లిd ఉభయసభలు ఆమోదించిన స్థానిక సంస్థల కొత్త చట్టం ముసాయిదా బిల్లు గవర్నర్‌ ఆమోదం పొంది గెజిట్‌ విడుదలైతే, నాలుగేళ్ళ కాలం ఆగాల్సి ఉంటు-ంది. అయితే ఈ బిల్లును ఆమోదానికి రాష్ట్ర గవర్నర్‌కు పంపించగా, రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ఇతర బిల్లులతోపాటు- దీన్ని కూడా గవర్నర్‌ పెండింగ్‌లో పెట్టడం ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు తలనొప్పిగా మారింది. గవర్నర్‌ అప్పుడే ఆమోదించి ఉంటే ఇంతటి రాజకీయ సంక్షౌభం ఎదురయ్యేది కాదు. ఈ ఏడాది జనవరి 27తో మూడేళ్ళు ముగియటంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాల్టిల్లో అవిశ్వాస తీర్మానాలు ఒకదాని వెనుక ఒకటిగా మొదలైనాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement