పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై ప్రతిపక్షలు సంధించిన అవిశ్వాస తీర్మానాన్ని నేడు ఎదుర్కోనున్నారు. పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేడు ఓటింగ్ జరగనుంది. ఇటీవల జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్‌ఖాన్‌పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ కాసీం సూరీ తిరస్కరించడాన్ని పాక్ సుప్రీం కోర్టు తప్పుబట్టింది. దీన్ని రాజ్యాంగ విరుద్ధ చర్యగా అభివర్ణించింది. శనివారం ఉదయం 10 గంటలకు ఇమ్రాన్‌ఖాన్ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఓటింగ్ నిర్వహించాలని స్పీకర్‌ను ఆదేశించింది. ఓటింగ్ పూర్తయ్యే వరకూ సభను వాయిదా వేయవద్దని ఆదేశించింది. అలాగే, పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తూ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ తీసుకొన్న నిర్ణయాన్ని కూడా రాజ్యాంగ విరుద్ధ చర్యగా పేర్కొన్న ధర్మాసనం.. వెంటనే పార్లమెంటును పునరుద్ధరించాలని ఆదేశించింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 58 క్లాజ్ (1) ప్రకారం జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలంటూ ప్రధాని.. అధ్యక్షుడికి సిఫారసు చేయకూడదని పేర్కొంది. అవిశ్వాస తీర్మానంలో ఒకవేళ ఇమ్రాన్ ఓడిపోతే, కొత్త ప్రధాని కోసం ఎన్నికలు నిర్వహించాలన్నది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన పాకిస్థాన్ అత్యున్నత ధర్మాసనం గురువారం రాత్రి ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పును విపక్షాలు స్వాగతించాయి. ఇమ్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ఈ తీర్పు చరిత్రాత్మకమైనదని పేర్కొన్నాయి.
ధరల నియంత్రణలో సర్కారు విఫలం అయిందంటూ ఇమ్రాన్‌పై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పాకిస్థాన్ రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా ఉన్నదని పేర్కొంటూ డిప్యూటీ స్పీకర్ కాసీం సూరీ ఆదివారం ఓటింగ్‌ను తిరస్కరించారు. అనంతరం ఇమ్రాన్ సిఫారసు మేరకు అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం తెలిసిందే. కాగా, 342 మంది సభ్యులున్న జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్‌కు 172 మంది మద్దతు అవసరం. అయితే, రెండు మిత్ర పక్షాలు దూరం కావడంతో ఇమ్రాన్ మెజారిటీ కోల్పోయారు. విపక్ష కూటమికి 199 మంది మద్దతు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.