న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ వడ్లు కొనుగోళ్ల వ్యవహారం ఎటూ తేలకుండానే ముగిసింది. శుక్రవారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు న్యూఢిల్లీలోని ఉద్యోగ్ భవన్‌లో కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, హోం మంత్రి మహమూద్ అలీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు, సురేష్ రెడ్డి, బీబీ పాటిల్, చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, తెలంగాణా భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై కూలంకశంగా చర్చించారు. ఖరీఫ్, రబీ కలిపి ఎంతమొత్తంలో సేకరిస్తామన్న విషయంపై నేతల బృందానికి కేంద్ర మంత్రి స్పష్టతనివ్వలేదు. సమావేశం అనంతరం వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ఎంతో ఆశతో సమావేశానికి వస్తే కేంద్ర ప్రభుత్వం నిరాశను మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాలేదని, అసంపూర్తిగానే సమావేశం ముగిసిందని ఆయన తెలిపారు. గత వారం మాదిరిగానే ఈసారి కూడా ఎలాంటి హామీ ఇవ్వలేదని చెప్పారు. యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసిందని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.
వానాకాలం (ఖరీఫ్), యాసంగి (రబీ) కలిపి మొత్తం ఏడాదిలో ఎంత మొత్తంలో కొంటారన్నది కూడా కేంద్రం చెప్పలేదని అన్నారు. ఏడాది కాలానికి ఏ రాష్ట్రం నుంచి ఎంత కొంటారో కేంద్రం ముందే చెబితే, ఆ మేరకు సాగు చేసేలా రాష్ట్రాలు ప్రయత్నిస్తాయని గత సమావేశంలో తెలంగాణ సీఎం కే. చంద్రశేఖర్ రావు చేసిన సూచన బావుందని మెచ్చుకున్న కేంద్ర మంత్రి, ఏడాది మొత్తానికి సాగు విస్తీర్ణం, దిగుబడిని ముందే అంచనా వేయడం సాధ్యం కాదని కేంద్ర వ్యవసాయ శాఖ నిస్సహాయత వ్యక్తం చేసిందని అన్నారు. అయితే 3 వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనలో దేశవ్యాప్తంగా రైతుల సమస్యలపై ఒక కమిటీ వేస్తున్నామని, రైతులు ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలో, వాటికి ఎంత మద్ధతు ధర ఇవ్వాలో ఆ కమిటీ నిర్ణయిస్తుందని కేంద్ర మంత్రి చెప్పారన్నారు. ఇప్పటికే తెలంగాణలో వరి కోతలు మొదలైనా, తాము ఇతమిద్ధంగా ఇంత కొంటామని కేంద్ర ప్రభుత్వం చెప్పలేకపోతోందని నిరంజన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం 62 లక్షల ఎకరాలకు పైగా ఉందని తాము చెబితే కేంద్రం తొలుత నమ్మలేదని, ఆ తర్వాత శాటిలైట్ చిత్రాలు, రిమోట్ సెన్సింగ్ విధానంతో శాస్త్రీయంగా లెక్కించి రాష్ట్రంలో 58 లక్షల ఎకరాల్లో వరి సాగైందని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుందని ఆయన వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో ఖరీఫ్ దిగుబడి నుంచి ముందే నిర్ణయించిన 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణ కోటాను మరింత పెంచుతామని చెబుతున్న కేంద్రం, ఎంత పెంచుతామన్నది మాత్రం స్పష్టం చేయడం లేదని నిరంజన్ రెడ్డి అన్నారు. రబీలో వరి సాగు చేయవద్దని కేంద్ర మంత్రి చెప్పారన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్ర మంత్రి సూచనకు పూర్తి భిన్నంగా ప్రకటనలు చేసిన విషయాన్ని ప్రస్తావించామని, దీనిపై తమ నేతలు తెలిసో తెలియకో మాట్లాడారని, ఆ తర్వాత వారిని వారించామని పీయూష్ గోయల్ తమతో చెప్పినట్టు నిరంజన్ రెడ్డి వెల్లడించారు. పంట మార్పిడి సూచించాం.. యాసంగిలో వరి వద్దనలేదు: కేంద్ర వర్గాలు యాసంగి పంటపై కేంద్ర ప్రభుత్వ వర్గాల వాదన మరోలా ఉంది. యాసంగిలో వరి వద్దని ఖరాఖండిగా తాము చెప్పలేదని, పంటమార్పిడి చేసుకోవాల్సిందిగా సూచన మాత్రమే చేశామని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఖరీఫ్ సీజన్‌లో ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయకుండా పరిమితి ఎలా పెంచమంటారని ఆయన ఎదురు ప్రశ్నించారు. తెలంగాణలో చాలా మందకొడిగా ధాన్యం సేకరణ జరుగుతోందని, ఎంత ధాన్యం కొంటామనే దానిపై ఒక ఏడాది ముందుగానే టార్గెట్ నిర్ణయించడం సాధ్యంకాదని ఆయనన్నారు. దేశంలోని పంటల పరిస్థితుల ఆధారంగా నిర్ణయం ఉంటుందని కేంద్ర వర్గాలు చెప్పుకొచ్చాయి. వ్యవసాయ శాఖ, ఆహార శాఖ సహా అనేక శాఖలు కలిసి అంచనాలు రూపొందించాల్సి ఉంటుందని వెల్లడించారు.