Monday, November 25, 2024

పొత్తుల్లేవ్.. ఒంట‌రిగానే పోటీ.. మాయావ‌తి కీల‌క ప్ర‌క‌ట‌న‌

2024లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోద‌ని, ఒంట‌రిగానే పోటీ చేస్తుంద‌ని బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఉత్త‌ర ప్రదేశ్ రాజ‌కీయాల్లో రాజకీయ పార్టీల మధ్య పొత్తు అవకాశాలపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎస్పీ – కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. గత కొన్నేళ్లుగా బాగా బలహీనపడిన బీఎస్పీ కూడా ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చని యూపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి కీలక ప్రకటన చేశారు. 2024లో ఉత్తర ప్రదేశ్‌లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆమె ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ బీఎస్పీ పొత్తు పెట్టుకోదని స్పష్టంచేశారు. రాష్ట్రంలోని మొత్తం 80 లోక్‌సభ నియోజకవర్గాల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు.

ఒంటరిగా లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని మాయావతి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘ఓటు మాది.. అధికారం మీది కానివ్వం’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ఇతర పార్టీలన్నీ కార్పొరేట్ సంస్థలు నిధి సాయం పొందుతున్నాయని.. ఒక్క బీఎస్పీ మాత్రమే పార్టీ కార్యకర్తల సాయంపై ఆధారపడుతోందని వ్యాఖ్యానించారు. లక్నోలో పార్టీ రాష్ట్ర స్థాయి నేతలతో సమావేశమైన మాయావతి.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా.. పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే పనిచేయాలని ఆమె సూచించారు. యూపీలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఎస్పీ ఘోరంగా విఫలం చెందింది. దీనిపై స్పందించిన మాయావతి.. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించి ఉంటే బీఎస్పీ మెరుగైన ఫలితాలు సాధించేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement