Friday, November 22, 2024

సింగిల్ గానే పోటీ చేస్తాం – అధికారం చేప‌డ‌తాంః బండి సంజ‌య్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రానున్న తెలంగాణ అసెంబ్లి ఎన్నికల్లో బీజేపీ సింహంలా సింగిల్‌గానే పోటీ చేస్తుందని, ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకోబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం కలిసి పోటి చేసినా అసెంబ్లి ఎన్నికల్లో బీజేపీదే గెలుపు అని తేల్చి చెప్పారు. వచ్చే అసెంబ్లి ఎన్నికల్లో కాంగ్రెస్‌, అధికార బీఆర్‌ఎస్‌ పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్నారు. అన్ని పార్టీలు కలిసి పనిచేసిన బీజేపీ గెలుపును అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. ఏ సర్వే చూసినా బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. గిరిజనుల సంక్షేమంపై సీఎం కేసీఆర్‌కు ప్రేమ ఉంటే వారి అభివృద్ధికి ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరించే ఆలోచన సీఎం కేసీఆర్‌కు లేదని తేల్చి చెప్పారు. సీఎం కేసీర్‌ తెలంగాణ రైతులను పట్టించుకోవడం లేదని, ఆయన తెలంగాణ ద్రోహి అని తీవ్ర విమర్శలు చేశారు. ములుగులో నియోజకవర్గస్థాయి పోలింగ్‌ బూత్‌ సభ్యుల సమ్మేళన కార్యక్రమంలో ఆయన పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీలో దోషులను తేల్చేవరకు బీజేపీ పోరాటం చేస్తుందని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. లీకేజీకి బాధ్యుడైన మంత్రి కేటీఆర్‌ను తక్షణమే మంత్రివర్గం నుండి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీపై సీఎం కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రధాని మోడీ తెలంగాణను అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నా, సీఎం కేసీఆర్‌ అందుకు సహకరించడం లేదని సంజయ్‌ ఆరోపించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల మయం చేసిన కేసీఆర్‌కు ప్రధాని మోడీని తిట్టడం తప్ప వేరే పనిలేదని విమర్శించారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హిందువుల పండుగ వేళల్లో షాపులు మూసేస్తారా..?, ఇతరుల పండుగలకు మాత్రం తెల్లవార్లు షాపులు తెరిచినా పట్టించుకోరా..?, రంజాన్‌ సమయంలో పాతబస్తీలో డ్రంకన్‌ డ్రైవ్‌ ఎందుకు చేయడం లేదు..?, తెలంగాణలో హిందువులకో న్యాయం..?, ఇతరులకో న్యాయమా..? అని ప్రశ్నించారు. పాకిస్థాన్‌ గెలిస్తే సంబురాలు చేసుకునే బీఆర్‌ఎస్‌ వంటి పార్టీలు అవసరమా..?, 80శాతం హిందువులున్న దేశంలో రామమందిరం కోసం బలిదానాలు చేయాల్సి రావడమా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ ప్రచారం చేయాలని, రాష్ట్రంలో రామరాజ్యం తీసుకువచ్చేందుకు కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్‌చార్జి సునిల్‌ బన్సల్‌ మాట్లాడుతూ… ఒక బూత్‌ నుంచి 16మంది కార్యకర్తలను తీసుకుని కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. కార్యకర్తలను గౌరవించుకునే పార్టీ బీజేపీ అని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు ఏ ఉద్దేశ్యంతో చేశారో అది నెరవేరిందా..? అని ప్రశ్నించారు. కేవలం కేసీఆర్‌ కుటుంబం కోసమే తెలంగాణ ఏర్పడినట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ కోసం బలిదానాలు చేసిన అమరులకు సముచిత స్థానం ఇస్తామన్నారు. ములుగు లాంటి ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటు చేసి, ఇక్కడి యువతకు ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement