Friday, November 22, 2024

అగ్నిపథ్​ వద్దు.. సుప్రీంకోర్టులో మూడు పిటిషన్లు, విచారణకు స్వీకరించిన ధర్మాసనం

అగ్నిపథ్​ పథకంలో అగ్నివీర్​ల నియామకం అంశం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. భారత ప్రధాన న్యాయమూర్తి ఆమోదానికి లోబడి సాయుధ బలగాలలో నియమకాలు చేపట్టేందుకు కేంద్రం రెడీగా ఉన్నట్టు తెలిపింది. అయితే.. ఇప్పటికే దీనిపై దాఖలైన పిటిషన్లను వచ్చే వారం విచారణకు స్వీకరించనున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. వేసవి సెలవుల తర్వాత సుప్రీంకోర్టు తిరిగి ప్రారంభమైంది. కాగా, బెంచ్ ముందుకు వచ్చిన ఈ పిటిషన్లను వచ్చే వారం స్వీకరించనున్నట్టు వెకేషన్ బెంచ్ సోమవారం తెలిపింది.

అయితే.. ఎయిర్ ఫోర్స్ ఆశావహులు దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా స్వీకరించాలని వెకేషన్ బెంచ్ ముందు అడ్వకేట్ కుముద్ లతా దాస్ ప్రస్తావించారు. ఇప్పటికే ఎంపిక ప్రక్రియలో ఉన్న వారికి ఈ పథకాన్ని వర్తింపజేయరాదని న్యాయవాది ఆ పిటిషన్​లో పేర్కొన్నారు. అగ్నిపథ్ పథకం అమలుతో ఔత్సాహికుల పదవీకాలం ఇప్పుడున్న 20 ఏళ్ల నుంచి నాలుగేళ్లకు కుదిస్తున్నరని ఆమె తెలిపారు. “ఇది అత్యవసర విషయం, దయచేసి విచారణకు స్వీకరించండి. అనేక మంది ఆశావహుల కెరీర్లు ప్రమాదంలో ఉన్నాయి” అని న్యాయవాది చెప్పారు.

‘అగ్నిపథ్’ పథకానికి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది ఎంఎల్ శర్మ, శిక్షణ పొందిన 70వేల మందికి పైగా ఔత్సాహికులు సుప్రీం కోర్టు ఆదేశాల కోసం చూస్తున్నారని, ఆ పథకానికి సంబంధించిన ప్రభుత్వ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ ధర్మాసనం ముందు తెలిపారు. మహమ్మారికి ముందు అపాయింట్‌మెంట్ లెటర్‌లు, వారి కెరీర్‌ వంటివన్నీ ఈ పథకం ద్వారా నాశనమైపోయాయని, సాయుధ దళాల రిక్రూట్‌మెంట్ స్కీమ్‌కు సంబంధించి సుప్రీంకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి.

ఈ కార్యక్రమం అమలుపై స్టే విధించాలని న్యాయవాది హర్ష్ అజయ్ సింగ్ పిటిషన్ కోరగా, ఈ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన హింసాత్మక నిరసనలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు న్యాయవాది విశాల్ తివారీ పిలుపునిచ్చారు. మూడవ పిటిషన్‌ను శర్మ ఈ పథకం యొక్క రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ, రక్షణ మంత్రిత్వ శాఖ జూన్ 14న వెలువరించిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ మరో పిటిసన్​ దాఖలు చేశారు.

అయితే.. కేంద్రం కూడా ఈ పిటిషన్లపై స్పందించింది. పిటిషన్లపై ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తమ వాయిస్​ని కూడా వినాలని సుప్రీంకోర్టును కోరింది. ‘‘నోటీసు ఇవ్వకుండా అగ్నిపథ్​ విషయంలో ఏమీ చేయవద్దు” అని కేంద్ర ప్రభుత్వం కేవియట్ దరఖాస్తులో పేర్కొంది. జూన్ 14న ప్రకటించిన అగ్నిపథ్ పథకం, 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వయసున్న యువకులను కేవలం నాలుగేళ్లపాటు మాత్రమే రిక్రూట్‌మెంట్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.

- Advertisement -

వారిలో 25 శాతం మందిని మరో 15 ఏళ్ల పాటు సాయుధ దళాలలో నే ఉంచుకునేలా నిబంధన ఉంది.. కాగా, ఈ పథకానికి వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రిక్రూట్‌మెంట్ కోసం గరిష్ట వయోపరిమితిని 23 సంవత్సరాలకు పొడిగించింది. జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ జేకే మహేశ్వరిలతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ కేసును విచారించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement