బీఆర్‌ఎస్ భారమంతా ఎమ్మెల్సీ కవితపైనే
పోచారం నియోజకవర్గానికే పరిమితం
ఎక్కడి నుంచైనా పోటీకి బాజిరెడ్డి సిద్ధం
హస్తం హవాలో అయోమయం
ఎంపీ అరవింద్ చుట్టూ బీజేపీ
ఎంఐఎం సవాళ్లపై అన్నీ పార్టీలలో చర్చ
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిపోసిన ఇందూర్ గడ్డ విలక్షణ రాజకీయ తీర్పునిస్తూ ఉంటుంది. నా తెలంగాణ కోటి రతణాల వీణ అని కీర్తించి, ప్రత్యేక రాష్ట్రం కోసం 16 వందల రోజుల రిలే దీక్షలు జరపడంతో ఇందూర్‌కు విశిష్ట స్థానం ఉంటుంది. పురాణాల చరిత్రలో బకాసురుల సంహారంతో అడుగులు వేసిన నేల, ఇంద్రప్రస్తుడు పాలనతో ఇంద్రపురిగా వెలిసిన ప్రాంతం. నిజాంసాగర్, శ్రీరాంసాగర్‌లను తన కడుపులో నింపుకుని అన్నదాతలను ఉన్నతంగా తీర్చిదిద్దిన ప్రాంతం. మంజీరా నదితో, పోచారం అభయారణ్యం, కౌలాస్ కోటలతో విశిష్టతను చాటుకున్న ఇందూర్ గడ్డ నిజామాబాద్ జిల్లాగా రూపాంతరం చెంది రాష్ట్ర రాజకీయాలకు కేంద్రంగా మారింది. ఉభయ కమ్యూనిస్టుల ఉద్యమాలు, నగ్జల్‌బరి ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్ళడంతో పాటు అంతకంటే తీవ్రతతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మోతే గ్రామం నుంచే ప్రారంభం కావడం జిల్లా ప్రత్యేకత. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు శాసనసభ ఎన్నికలలో బీఆర్‌ఎస్ పట్టు సాధించింది. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కొందరు సొంత పార్టీ ప్రజాప్రతినిధుల తీరుతో ఆ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్సీ కవితను ఓడించడానికి కృషి చేశారనే విమర్శలు మూటకట్టుకున్నారు. రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మెన్ స్థానాన్ని బీఆర్‌ఎస్ కైవసం చేసుకుని రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడానికి దోహదపడింది.
నిజామాబాద్, ప్రభన్యూస్:
ఎమ్మెల్సీ కవిత కేంద్రంగానే ఇందూర్ జిల్లా రాజకీయాలు –
ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత సొంత జిల్లా కావడంతో ఈ ప్రాంత రాజకీయాల్లో ఆమె ప్రభావం తీవ్రంగా ఉంది. రాజకీయ దురంధరుడు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన నియోజకవర్గానికే పరిమితం కావడం బీఆర్‌ఎస్ పార్టీకి ప్రతికూలాంశం. అయితే ఎమ్మెల్సీ కవిత ఎంపీగా ఓటమి పాలైనప్పటికీ ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది శాసనసభ స్థానాలు ఆమె కనుసన్నల్లోనే నడుస్తుంటాయి. ఆత్మీయ సమావేశాల పేరుతో ఎప్పటికప్పుడు ఆమె ద్వితీయ శ్రేణి నాయకత్వానికి, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉంటుంటారు. ఆమె శాసన సభ్యులతో కలిసి కార్యక్రమాలను విజయవంతం చేసుకోవడానికి కృషి చేస్తుంటారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అత్యంత దగ్గర సంబంధాలు ఉండడంతో ఆయన రాజకీయాలలో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. పార్టీ నిర్ణయించిన ఆత్మీయ సమ్మేళనాలలో అసంతృప్తి జ్వాలలు నివురుగప్పి ఉన్నప్పటికీ నాయకులు బయటకు వెలుగుచూపలేదు. దశాబ్ది వేడుకలు పార్టీ క్యాడర్ మరింత దగ్గర కావడానికి ఉపయోగపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పర్యటన, కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపొందడంతో రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యే బాజిరెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి ప్రశాంత్ రెడ్డిల గెలుపు నల్లేరు మీద నడకలా ఉంటుందని భావించినప్పటికీ కాంగ్రెస్, బీజేపీలు గట్టిపోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయోమయంలో నిజామాబాద్ అర్బన్
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలలో అయోమయాన్ని సృష్టిస్తోంది. ప్రధాన పార్టీల తరపున కొత్త నేతలు బరిలో దిగే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బిగాల గణష్ గుప్త మూడోసారి బరిలో దిగే అవకాశం ఉన్నప్పటికీ, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పేరు తెరపైకి వచ్చింది. తప్పనిసరి పరిస్థితులు వస్తే ఎమ్మెల్సీ కవిత బోధన్ లేదా నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీకి దిగొచ్చని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి మహేష్ కుమార్‌గౌడ్, తాహేర్ బీన్, కేశ వేణు రేసులో ఉండగా, పీసీసీ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ ప్రస్తుత అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సహకారంతో తన కుమారుడు సంజయ్‌కి టికెట్ ఇప్పించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన మరో కుమారుడు అరవింద్ బీజేపీ నుంచి ఎంపీగా గెలుపొందారు. బీజేపీ నుంచి ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త, యెండల లక్ష్మీనారాయణ పోటీ పడుతున్నారు. సుమారు లక్షకు పైగా ముస్లిమ్‌ల ఓట్లు కలిగిన నిజామాబాద్ అర్బన్ ప్రాంతం అభ్యర్థుల గెలుపు, ఓటములను నిర్ణయిస్తుంది. ఇప్పటివరకు బీఆర్‌ఎస్‌తో దోస్తీ కట్టిన ఎంఐఎంపై ఇటీవల జరిగిన జిల్లా పరిణామాలు ప్రభావం చూపాయి. బోధన్ నియోజకవర్గంలో ఇద్దరు ఎంఐఎం నాయకులపై కేసులు నమోదు చేయడంపై ఆ పార్టీ అధిష్టానం తీవ్రంగా మండిపడుతోంది. మేయర్ ఎన్నికల్లో సైతం తమ అభ్యర్థికి మేయర్ స్థానాన్ని ఇవ్వాలని పట్టుబట్టి చివరి క్షణంలో బీఆర్‌ఎస్‌తో రాజీపడ్డారు. ఇటీవల జిల్లాకు వచ్చిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటన బీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్ పార్టీనీ అయోమయానికి గురిచేసింది.
నిజామాబాద్ రూరల్….
నిజామాబాద్ రూరల్‌లో బీఆర్‌ఎస్ నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆయన స్థానంలో ఆయన కుమారుడు బాజిరెడ్డి జగన్‌కు అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానంతో చర్చించారు. అయితే ప్రస్తుతం మారుతున్న రాజకీయాల దృష్ట్యా బాజిరెడ్డినే పోటీలో నిలపాలని పార్టీ భావిస్తోంది. జిల్లాలో బాజిరెడ్డి విలక్షణమైన రాజకీయ నేత. ఉమ్మడి జిల్లాలోని ఆర్మూర్, బాన్సువాడ, నిజామాబాద్ రూరల్‌లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజానేతగా ఆయనకు పేరుంది. గతంలో పోటీ చేసిన డాక్టర్ భూపతిరెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ నగేష్ రెడ్డి పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ టికెట్ రేసులో ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి కూడా కాంగ్రెస్ వైపుకే చూస్తున్నారు. బీజేపీలో ఎంపీ అరవింద్ అనుచరుడు దినేష్ టికెట్ ఆశిస్తున్నారు.
ధీమాలో మంత్రి ప్రశాంత్ రెడ్డి
బాల్కొండ బాద్‌షాగా మరోసారి హ్యాట్రిక్ కొట్టే దిశగా ప్రశాంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. బాల్కొండ రాజకీయాల్లో ఆయన పన్నిన ఎత్తుగడలు ప్రత్యర్థులు లేకుండా చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్, బీజేపీల నుంచి ఆయ నను ఎదురొడ్డే అభ్యర్థులు కనిపించడం లేదు. కాంగ్రెస్ టికెట్ కోసం ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఈయన గతంలో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి 40 వేలకు పైగా ఓట్లు సాధించారు. కాంగ్రెస్ పవనాలను అనుకూలంగా మార్చుకోవడంలో ఈరవర్తి అనిల్ విఫలమయ్యారు.
ఆర్మూర్ నియోజకవర్గం….
ఆర్మూర్ నియోజకవర్గంలో ఈసారి పోటీ రసవత్తరం కానుంది. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మళ్ళీ బరిలో నిలవనున్నారు. ఇటీవల జరిగిన సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత జీవన్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. భారతీయ జనతాపార్టీ నుంచి ఎంపీ అరవింద్ బరిలో దిగుతున్నారనే కోణంలో జీవన్‌రెడ్డినే పోటీకి దించాలని అధిష్టానం ఆలోచిస్తోంది. బీజేపీ నుంచి పైడి రాకేష్ రెడ్డి, వినయ్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ హయాంలో ఆకుల లలిత గెలుపొందారు. ప్రస్తుతం ఆమె బీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నారు. రైతు నేత వేముల సురేందర్ రెడ్డి కూతురు రాధిక సురేందర్ రెడ్డిని ఆర్మూర్ బరిలో నిలపడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ ప్రాంతంలో రైతుల ప్రభావం తీవ్రంగా ఉండడం, సురేందర్ రెడ్డి ప్రభావం కూడా ఉండడంతో ఆమెను పోటీలో నిలపడానికి కృషి చేస్తున్నారు. త్వరలోనే ఆమె ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరగడంతో త్రిముఖ పోరు తప్పనిసరి అని తెలుస్తోంది.
బోధన్‌లో బరిలో నువ్వా..? నేనా..?
బోధన్ నియోజకవర్గ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మిత్రపక్షాలయిన బీఆర్‌ఎస్, ఎంఐఎంలు రాజకీయ ప్రత్యర్థులుగా మారి పార్టీ కార్యకర్తలను, నాయకులను అయోమయంలో పడేస్తున్నారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే షకీల్‌కి, మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త శరత్‌రెడ్డితో ఉన్న వివాదం పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా, మూడుసార్లు శాసన సభ్యులుగా పనిచేసిన ఆ పార్టీ కోశాధికారి సుదర్శన్ రెడ్డి ఏమాత్రం క్యాడర్‌ను నిలిపి ఉంచలేకపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ పవనాలు వీస్తుండడంతో సుదర్శన్ రెడ్డి చాపకింద నీరులా విస్తరిస్తున్నారు. క్లీన్ ఇమేజ్ ఉన్న సుదర్శన్ రెడ్డి చివరిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కృషి చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి మేడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డిలు ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఊరురా శివాజీ విగ్రహాలు ఏర్పాటు చేయడం ద్వారా మేడపాటి యువతకు చేరువవుతున్నారు. రైతులతో, వ్యాపారులతో ఉన్న సంబంధాలను మోహన్ రెడ్డి తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
బాన్సువాడలో పోచారందే హవా…
బాన్సువాడ నియోజకవర్గంలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హవా కనిపిస్తోంది. 11,500ల డబుల్ బెడ్ రూమ్‌ల ఇళ్లు కట్టించిన ఘనత ఆయన సొంతం. ఈసారి ఎన్నికల్లో తన కుమారుడు భాస్కర్ రెడ్డికి టికెట్ ఇప్పించాలని ప్రయత్నించినప్పటికీ అధిష్టానం అందుకు అంగీకరించలేదు. ఆయన కుమారుడు సురేందర్ రెడ్డి పార్టీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల విషయంలో ఆ పార్టీ నుంచి స్పష్టమైన నిర్ణయం లేకుండా పోయింది. ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగా మండలాల్లో నాయకులు పనిచేస్తున్నారు. ఇప్పటివరకు రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన కాసుల బాల్‌రాజ్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. పార్లమెంటు ఇన్‌చార్జ్ మధన్ మోహన్ ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ ఇన్‌చార్జ్ మాల్యాద్రిరెడ్డి పోటీలో ఉన్నారు. మహిళా నాయకురాలు గీతారెడ్డి ఉన్నప్పటికీ ఆమె స్థానికంగా ఈ ప్రాంతంలో లేరు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్యనే పోటీ ఉందనుకున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ పోటీకి నిలబడితే పోటీ తీవ్రంగానే ఉంటుంది.
ఆసక్తికరంగా కామారెడ్డి పోరు
వరుస పరాజయాలను మూటగట్టుకున్న మాజీ మంత్రి షబ్బీర్ అలీ సర్వశక్తులు ఒడ్డి తన ప్రభావాన్ని నిలుపుకోవడానికి పోరాడుతున్నారు. పోలింగ్‌కు ఒకటి, రెండు రోజుల ముందు తెరపైకి వచ్చిన కత్తిపోట్ల సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తున్నారు. జడ్పీ మాజీ చైర్మెన్ యమునా రెడ్డి బీజేపీ నుంచి పోటీకి ప్రయత్నిస్తున్నారు. రెండుసార్లు గెలిచిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మాచారెడ్డి నర్సింగ్ రావుకు మంత్రి కేటీఆర్ ఆశీస్సులు ఉండడంతో ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు.
ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ పవనాలు
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తన సంస్థాగత ఓటు బ్యాంకును పదిలంగానే ఉంచుకుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సురేందర్ బీఆర్‌ఎస్‌లో చేరినప్పటికీ క్యాడర్ మాత్రం ఆయన వెంట వెళ్ళలేదు. మదన్ మోహన్, సుభాష్ రెడ్డిలు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిద్దరి మధ్య సయోధ్య కుదరకపోతే ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. అప్పటి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఉన్నా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి పార్టీలో చేరడంతో ఆయన పార్టీ వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఉద్యమ నేతగా ఉన్న ఈటల రాజేందర్‌తో ఆయన రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉంది.
జుక్కల్‌లో హోరాహోరీ
అంతరాష్ట్ర సరిహద్దులు కలిగి ఉన్న జుక్కల్ నియోజకవర్గం విలక్షణ తీర్పునిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక సంస్కృతి, సంప్రదాయాల మేళవింపుతో ఈ నియోజకవర్గం ఉంటుంది. ఎస్సీ రిజర్వు స్థానం కావడంతో తరచూ అభ్యర్థులు మారుతుంటారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న హన్మంత్ షిండే మరోసారి బీఆర్‌ఎస్ తరపున బరిలో నిలవనున్నారు. మాజీ ఎమ్మెల్యే సౌధాగర్ గంగారాం కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు. డీసీసీ మాజీ అధ్యక్షుడు గడుగు గంగాధర్, జర్నలిస్టు తోట లక్ష్మీనారాయణ కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే అరుణ తార, నాయుడు ప్రకాష్‌లు పోటీ పడే అవకాశం ఉంది. లింగాయత్ సమాజంలో బిచ్కుంద మఠాధిపతి సోమయ్యప్ప సైతం బీఆర్‌ఎస్ నుంచి పోటీలో ఉన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఆయనను పిలిపించి మాట్లాడారు. లింగాయత్ ఓటర్లు, మున్నూరు కాపుల ఓట్లు అధికంగానే ఉంటాయి.