నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ రాజీనామా చేయాలంటూ సోషల్ మీడియాలో పలువురు ట్రోలింగ్ చేస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎంపీగా తనను గెలిపిస్తే ఐదు రోజుల్లోనే నిజామాబాద్‌కు పసుపు బోర్డు తీసుకువస్తానని, బోర్డు తీసుకురాకుంటే రాజీనామా చేసి రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తానని ధర్మపురి అరవింద్ హామీ ఇచ్చారని గుర్తుచేస్తున్నారు. ఆయన గెలిచి నేటికి 638 రోజులు అయిందని, పసుపు బోర్డు విషయాన్ని ధర్మపురి అరవింద్ బాండ్ పేపర్‌పై రాసి సంతకం చేసి మరీ ఇచ్చారని ఆరోపిస్తున్నారు. తాజాగా పార్లమెంట్‌లో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంతో రాష్ట్రంలో పసుపుబోర్డు ఏర్పాటుకాదనే విషయం తేలిపోయిందని.. ఇప్పటికైనా ఎంపీ ధర్మపురి అరవింద్ తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీని గుర్తుచేసుకోవాలని లేదా తన పదవికి రాజీనామా చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కొందరు అయితే ‘ఛీటర్ అర్వింద్’ అంటూ నిప్పులు చెరుగుతున్నారు. మరికొందరు‘అర్వింద్ తప్పుకో.. మాట నిలబెట్టుకో’ అంటూ మండిపడుతున్నారు.
కొసమెరుపు ఏంటంటే.. మంగళవారం లోక్‌సభలో పసుపు బోర్డుపై చర్చ జరుగుతున్న సమయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సభలో కనిపించకపోవడం గమనార్హం.