బిజెపి..ఎన్డీఏతో తెగతెంపులు చేసుకున్న నితీశ్ కుమార్ ఆర్జేడీ..కాంగ్రెస్ కూటమితో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి పదవిపై తాను దృష్టి పెట్టవచ్చనే వార్తలను ఆయన ఖండించారు. చేతులు జోడించి చెబుతున్నా. నాకు అలాంటి ఆలోచనలు లేవు. అందరి కోసం పనిచేయడమే నా పని. ప్రతిపక్షాలన్నీ కలిసి పనిచేసేలా కృషి చేస్తాను. వాళ్లు కూడా ఇదే పని చేస్తే బాగుంటుందని స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగి మిత్రపక్షమైన బీజేపీకి నమ్మక ద్రోహం చేశారంటూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై నితీశ్ స్పందించారు. ఇవి అర్థరహిత, నిరాధార ఆరోపణలు అన్నారు.
బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌కు జెడ్ ప్లస్ భద్రత కల్పించడంపై ప్రశ్నించే హక్కు బీజేపీకి లేదన్నారు. తేజస్వి భద్రతకు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ‘తేజస్వి డిప్యూటీ సీఎం. అతను జెడ్ ప్లస్ భద్రత ఎందుకు పొందకూడదు.. బీజేపీ వాళ్లు పిచ్చి మాటలు మాట్లాడతారు. అవన్నీ పనికిరానివి’ అని నితీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రధాన మంత్రి పదవిపై తనకు ఆసక్తి లేదని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. ఈ విషయంలో రోజూ తనకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పారు.