Tuesday, November 26, 2024

ప్రాంతీయ వ్యూహానికి ‘నితీష్’ ప‌దును..

పాట్నా: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు బీహార్‌ ముఖ్యమంత్రి, జేడీ(యు) నేత నితీశ్‌కుమార్‌ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్న మమతా బెనర్జీ వంటి బలమైన ప్రాంతీయ నేతలను మెప్పించేలా వ్యూహాలు సిద్ధంచేస్తున్నారు. ఆయన ప్రతిపాదిస్తున్న ప్రాంతీయ వ్యూహం ఆయా రాష్ట్రాల్లోని ఎన్డీయేతర కూటమి పార్టీలకు సమ్మతంగా ఉన్నట్లు తెలుస్తున్నది. నితీశ్‌ ప్రతిపాదించిన వన్‌ ఆన్‌ వన్‌ ప్లాన్‌ మమతా బెనర్జీని ఆకట్టుకుందని, కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగే మమతా బెనర్జీ ఇప్పుడు హస్తంతో నేస్తానికి అంగీకరించారని జేడీయు సీనియర్‌నేత త్యాగి చెప్పారు.

ఏమిటీ వన్‌ ఆన్‌ వన్‌ ప్రణాళిక?
ప్రస్తుతం కాంగ్రెస్‌ అన్ని రాష్ట్రాల్లో బలంగా లేదు. కానీ దాదాపు అన్నిచోట్లా ఆ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటు న్నారు. అదే సమయంలో ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు ఒంటరిగా బరిలోకి దిగుతున్నాయి. దీని వల్ల కొంత ఓట్ల చీలిక జరిగి, అంతిమంగా బీజేపీకి లాభిస్తోం ది. దీనికి విరుగుడుగానే నితీశ్‌ వన్‌ ఆన్‌ వన్‌ పేరుతో సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీతో ప్రాంతీ య పార్టీలు లేదా కాంగ్రెస్‌ మాత్రమే పోటీచేయా లన్నది ఆయన ప్లాన్‌. బలమైన ప్రాంతీయ పార్టీలు 2024లో బిజెపిని తమ సొంత గడ్డపై ఎదుర్కోవడానికి ఒంటరిగానే ఉండాలని, అదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్‌ ముఖాముఖి పోటీలో ఉన్న 200కిపైగా స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని సూచించారు.

థర్డ్ ఫ్రంట్‌ ఆలోచన విరమణ?
నితీశ్‌ సూచనతో మమతా బెనర్జీ కాంగ్రెసేతర థర్డ్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ఉద్దేశాన్ని విరమించుకున్నారు. నితీష్‌ కుమార్‌తో భేటీ సందర్భంగా ఆమె ఈ విషయం చెప్పారు. కాంగ్రెస్‌తో కూడిన విపక్ష కూటమికి సానుకూలంగా స్పందించారు అని త్యాగి చెప్పుకొచ్చారు. పాట్నాలో ప్రతిపక్ష నేతల సమావేశం పెట్టాలని కూడా మమతా బెనర్జీ చెప్పారు. జేపీ (జయప్రకాశ్‌ నారాయణ్‌) ఉద్యమం ప్రారంభించినప్పుడు బీహార్‌ కేంద్రంలో మార్పుకు ప్రతీక. మళ్లిd అలాంటి మార్పును ఇక్కడినుంచే ప్రారంభించాలని భావిస్తున్నారు. కర్ణాటకలో బీజేపీపై కాంగ్రెస్‌ నిర్ణయాత్మక విజయం సాధించిన కొన్ని రోజుల తర్వాత, మమతా బెనర్జీ 2024 ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లే తన ప్రణాళికలను విరమించుకుంటున్నట్లు ప్రకటించడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement