Friday, November 22, 2024

మోదీ బావ కూడా మోసగాడే.. విదేశాలకు వెళ్లకుండా హైకోర్టు ఆర్డర్స్​!

పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ బావ మయాంక్ మెహతా విదేశాలకు వెళ్లకుండా బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తను హాంకాంగ్‌కు తిరిగి వెళ్లేందుకు అనుమతించిన ముంబై ప్రత్యేక కోర్టును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శుక్రవారం సవాలు చేసింది. బ్యాంక్ మోసం కేసులో మెహతా నిందితుడని పేర్కొంది. మెహతా విదేశాలకు వెళ్లేందుకు అనుమతించిన కింది కోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని సీబీఐ కోరింది.

దీనిపై ఇవ్వాల సీబీఐ తరపు ప్రత్యేక న్యాయవాది రాజా థాకరే హైకోర్టులో జస్టిస్ పీడీ నాయక్ ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. మెహతాను విదేశాలకు వెళ్లకుండా స్టే విధించాలని కోరారు. మెహతా తరఫు న్యాయవాది విక్రమ్ నన్కానీ వాదనలు వినిపిస్తూ.. సీబీఐ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ తాము సమాధానం ఇవ్వాలని కోరుతున్నామని చెప్పారు.అయితే.. జస్టిస్ నాయక్ జవాబివ్వడానికి సమయం మంజూరు చేస్తూ తదుపరి విచారణ వరకు మెహతా విదేశాలకు వెళ్లకుండా నిషేధం విధించారు. సీబీఐ పిటిషన్‌పై వచ్చే వారం కోర్టు విచారణ చేపట్టనుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన రూ.13,850 కోట్ల మోసం కేసుకు సంబంధించి కేంద్ర ఏజెన్సీలు నీరవ్ మోదీతో పాటు ఇతరులను కూడా విచారణ చేపడుతున్నాయి. ఈ కేసులో మయాంక్ మెహతా, అతని భార్య పూర్వీ మెహతాను నిందితులుగా ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చూపించింది. దీంతో ముంబైలోని ED, PMLA కోర్టుకు లేఖ రాసిన వారు విదేశాలకు వెళ్లేందుకు ఆమోదం పొందారు.

 అయితే.. సీబీఐ కేసులో తనను నిందితుడిగా కూడా చూపించలేదని, విచారణ ప్రారంభమైనప్పటి నుంచి సమన్లు ​​పంపలేదని మెహతా పీఎంఎల్‌ఏ కోర్టులో పలు దరఖాస్తు దాఖలు చేశారు. వీటిని సీబీఐ వ్యతిరేకించింది. ఈ కేసులో తాము చార్జిషీట్ దాఖలు చేశామని, ఇంకా విచారణ కొనసాగిస్తున్నామని పేర్కొంది. కొన్ని లావాదేవీలకు సంబంధించిన ఖాతాల స్టేట్‌మెంట్‌ను అందించినందుకు మెహతాకు నోటీసులు అందజేసినట్టు సీబీఐ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement