Wednesday, November 20, 2024

తొమ్మిది వేల మంది సైనికులు మృతి.. ఉక్రెయిన్ ప్రతిఘటనతో రష్యాకు గట్టి దెబ్బ

రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకరపోరు కొనసాగుతోంది. ఉక్రెయిన్ పై రష్యా సేనలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. క్షిపణులతో వరుస దాడులు చేస్తున్నాయి. అయితే.. ఉక్రెయిన్ సేనలు కూడా ఎంత‌కూ తగ్గేది లేదంటూ ప్ర‌తిఘ‌టిస్తున్నాయి. ఉక్రెయిన్ సైనికులు కూడా గట్టిగానే పోరాటం చేస్తున్నారు. ఉక్రెయిన్ బలగాల నుంచి రష్యాకు భారీ స్థాయిలో ప్రతిఘటన ఎదురవుతోంది. ఇరువర్గాల పోరులో నిత్యం వందలాది మంది సైనికులు, ఉక్రెయిన్‌ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, ఉక్రెయిన్ పై పోరులో రష్యా సేనలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. రష్యా.. పెద్ద సంఖ్యలో సైనికులను కోల్పోయినట్టు సమాచారం. వారం రోజులుగా కొనసాగుతున్న భీకర యుద్ధంలో ఉక్రెయిన్‌ బలగాల ప్రటిఘటనలో ఇప్పటివరకు 9వేల మంది రష్యా సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్ర‌క‌టించారు. ఈ నేపథ్యంలో చ‌నిపోయిన‌ సైనికుల దేహాలను తరలిచేందుకు రష్యా పదుల సంఖ్యలో హెలికాప్టర్లను వినియోగిస్తోందన్నారు.

ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కీవ్‌ నుంచి వెళ్లిపోవాలని పశ్చిమ దేశాలు ఇప్పటికే నాలుగుసార్లు తనకు సూచించాయని జెలెన్‌స్కీ తెలిపారు. ఉక్రెయిన్‌లో తీవ్ర దాడులకు తెగబడుతున్న రష్యా సేనలు, కొంత పట్టుసాధిస్తున్నప్పటికీ భారీ స్థాయిలో సైనిక, ఆయుధ నష్టాలను చవిచూస్తోందని ఉక్రెయిన్‌ రక్షణశాఖ వెల్లడించింది. భారీగా సైనికులను కోల్పోవడమే కాదు.. 217 యుద్ధ ట్యాంకులు, 900 సాయుధ శకటాలు, 374 యుద్ధ వాహనాలు, 90 ఫిరంగులు, 30 విమానాలు, 31 హెలికాప్టర్లు, వందల సంఖ్యలో ఇంధన ట్యాంకులు, భారీ మొత్తంలో యుద్ధ సామగ్రిని ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడించింది.

అంతేకాకుండా ఉక్రెయిన్‌లో యుద్ధంలో జరిగిన ప్రాణనష్టంపై రష్యా కూడా స్పందించింది. 9వేల మంది రష్యన్ సైనికులు చనిపోయారని యుక్రెయిన్ అంటుంటే.. ఇప్పటివరకు 498 మంది రష్యా సైనికులు మరణించారని, 1597 మందికి గాయాల య్యాయని రష్యా తెలిపింది. ఇక ఉక్రెయిన్‌కు చెందిన 2870 మంది సైనికులు తమ దాడుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు ర‌ష్యా వెల్లడించింది. రష్యా దాడుల్లో ఇప్పటికే 2వేల మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్‌ ఆరోగ్య విభాగం తెలిపింది. ఇలా ఇరువర్గాల మధ్య జరుగుతున్న పోరులో వేల సంఖ్యలో ప్రాణనష్టం సంభవిస్తోంది.

దాడులను ముమ్మరం చేసిన రష్యా సైన్యం ఇప్పటికే ఖేర్సన్‌ నగరాన్ని హస్తగతం చేసుకోగా.. ఖార్కివ్‌, కీవ్‌ నగరాలను తమ వశం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే వేల సంఖ్యలో రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారనే వార్తలు వస్తుండగా.. రష్యా సేనలకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉక్రెయిన్‌ సైన్యం జరిపిన ప్రతిదాడుల్లో రష్యా మేజర్‌ జనరల్‌ ఆండ్రీ సుఖోవిట్స్‌స్కీ మృతి చెందినట్లు ఉక్రెయిన్‌ మీడియా తెలిపింది. రష్యా సెంట్రల్‌ మిలటరీ కేంద్రంలో డిప్యూటీ కమాండర్‌గా ఉన్న ఆండ్రీ.. సైనిక చర్యలో ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఆయన సన్నిహితుడు తెలిపినట్లు వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement