ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నేటితో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఎన్నికల నిర్వహణకు సహకరించిన మీడియాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన వారసురాలిగా వస్తున్న మాజీ సీఎస్ నీలం సాహ్నీకి అభినందనలు తెలియజేశారు. ఎన్నికల కమిషన్ పరిధిలో ఉన్న పలు అంశాలను ఆమె దృష్టికి తీసుకుని వెళ్లానని చెప్పారు.
అటు గవర్నర్ అపాయింట్ మెంట్ తనకు లభించలేదని వచ్చిన వార్తలపై స్పందించిన ఆయన.. ఇటీవల టీకాను తీసుకున్న గవర్నర్, కొన్నివైద్య పరీక్షల నిమిత్తం వెళ్లాల్సి ఉన్న కారణంగా,మంగళ, బుధ వారాల్లో ఎవరినీ కలవబోవడం లేదని తనకు సమాచారం అందిందన్నారు. త్వరలోనే గవర్నర్‌ను కలిసి తాను పదవిలో ఉన్న సమయంలో తయారు చేసిన రిపోర్టును అందిస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వ సహకారం, సీఎస్, డీజీపీలతో పాటు ఉద్యోగులు అందించిన తోడ్పాటుతో స్థానిక ఎన్నికలను విజయవంతం చేశామని చెప్పిన ఆయన.. సమయం ఉంటే పరిషత్ ఎన్నికలను కూడా నిర్వహించి ఉండేవాళ్లమని, అయితే.. తనకు అంత సమయం లేదన్నారు.
తనకు గతంలో తెలంగాణలో ఓటు హక్కు ఉండేదని, దాన్ని స్వగ్రామానికి మార్చుకుందామని భావించానని, తన ఓటును తాను మార్చుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడి నుంచైనా ఒకసారి ఓటు వేసే హక్కు ప్రతి ఒక్క పౌరుడికీ ఉందని, తన హక్కుల సాధనకు ఓ సామాన్య పౌరుడిగా రేపటి నుంచి పోరాడతానని, ఈ విషయంలో హైకోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధమన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు.