ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల వ్యవహారంపై వివాదం కొనసాగుతోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలతో థియేటర్లు నడపలేమని వాటి యజమానులు ప్రకటిస్తున్నారు. న్యూ ఇయర్, సంక్రాంతి సీజన్‌లో పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో థియేటర్లు మూసివేత నిర్మాతలకు ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమాలు కూడా ప్రదర్శించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కొందరు టాలీవుడ్ హీరోలు స్పందిస్తున్నారు.
టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై ఇప్పటికే యంగ్ హీరో నాని బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ఆయనకు వైసీపీ నేతలు సైతం కౌంటర్ ఇచ్చారు. అనంతరం హీరో సిద్ధార్ధ్ కూడా ఏపీ సర్కార్ పై మండిపడ్డారు. తాజాగా యంగ్ హీరో నిఖిల్ కూడా స్పందించారు. థియేటర్లు నాకు దేవాలయం లాంటిదని.. ప్రజలకు ఆనందాన్ని ఇస్తాయని.. థియేటర్లు మూత పడటం బాధాకరం అని నిఖిల్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమకు మద్దతు ఇవ్వడం సంతోషకరం అని.. తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో థియేటర్లకు తిరిగి వైభవం రావడానికి ఏపీ ప్రభుత్వం సహాయపడుతుందని ఆశిస్తున్నానని చెప్పారు. ప్రతి సింగిల్ స్క్రీన్ థియేటర్ లో రూ.20 టికెట్ సెక్షన్ ఉందని.. థియేటర్లు ఇప్పటికీ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఫ్లెక్సిబుల్ టికెట్ రేట్లను బాల్కనీ/ ప్రీమియం విభాగంలో అనుమతించాలని కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..