తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగిపోయింది. గత 24 గంటల్లో కొత్తగా 394 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆక్షంలు విధించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణవ్యాప్తంగా పలు పాఠశాలలో కరోనా కేసులు కలకలం రేపాయి. దీంతో పాఠశాలల మూసివేతకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అంతేకాదు సినిమా థియేటర్లు, జనాల రద్దీ ఉండే ప్రాంతాల్లో ఆంక్షలు విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కరోనాపై త్వరలో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇటీవలే అసెంబ్లీలో సీఎం ప్రకటన కూడా చేశారు.
తెలంగాణలో పాక్షికంగా లాక్డౌన్ అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. రాత్రిపూట కర్ఫ్యూపై విధించే అవకాశం ఉంది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. ప్రధాన నగరాల్లో లాక్డౌన్ కూడా అమలు చేస్తున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రల్లో ఆంక్షలు విధించాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో తెలంగాణ కూడా అదే దారిలో వెళ్లనున్నట్లు తెలుస్తోంది. విద్యా సంస్థలు, హాస్టళ్లు, గురుకులాల్లో వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. దీంతో విద్యా సంస్థల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో కేసుల సంఖ్య ఎంత పెరిగినప్పటికీ దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.