కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేయవద్దని చెన్నై గ్రీన్ ట్రైబ్యునల్ స్టే విధించింది. ఏపీ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని NGT ఈ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వివరణతో ఎన్జీటీ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది.
కాగా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని కరివెన వద్ద నిర్మిస్తున్నారు. దీనికి 2015, జూన్ 11న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణానది నుంచి 70 టీఎంసీల వరద నీటిని ఎత్తిపోయడం ఈ ప్రాజెక్టు లక్ష్యంగా ఉంది… ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలకు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2.7 లక్షల ఎకరాలకు, నల్లగొండ జిల్లాలో 0.3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రణాళికగా ఉంది. హైదరాబాద్ కు తాగునీరు, పారిశ్రామిక అవసరాల కోసం, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో తాగునీరు, సాగునీరు అందించే లక్ష్యాలతో ఈ ప్రాజెక్టును చేపట్టింది. అయితే, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుపై ఏపీ అభ్యంతరం చెబుతూ వస్తోంది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్.. ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని ఆదేశించింది. కేంద్ర అటవీశాఖ అనుమతులు తప్పనిసరి అని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగినట్టు అయ్యింది.
ఇది కూడా చదవండి: ‘ధరణి’కి ఏడాది.. 10 లక్షలకుపైగా లావాదేవీలు