హైదరాబాద్ ఆంధ్రప్రభ : వచ్చే విద్యా సంవత్సరం మరింత ఆలస్యం కానుంది. జేఈఈ మెయిన్ షెడ్యూల్ ప్రభావం ఇప్పటికే ఇంటర్ వార్షిక పరీక్షలపై పడడమేకాకుండా రాబోయే 2022-23 విద్యా సంవత్సరంపైనా పడనుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ తరగతులు ఆగస్టులో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు విద్యావర్గాలు పేర్కొంటున్నాయి. టెన్త్ పరీక్షలు మే 23 నుంచి జూన్ ఒకటి వరకు, ఇంటర్మీడియట్ పరీక్షలు మే 6 నుంచి 24 వరకు జరగనున్నాయి. పదో తరగతి చివరి పరీక్ష జూన్ ఒకటో తేదీన ముగుస్తుంది. ఆ తర్వాతే జిల్లా కేంద్రాల్లో సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతోంది. గతంలో 11 పేపర్లు ఉన్నప్పడు వాటి వ్యాల్యుయేషన్‌కు 15 రోజుల సమయం పట్టేది. కానీ ప్రస్తుతం 6 పేపర్లు కాబట్టి కనీసం పది రోజుల సమయం పడుతోంది. ఆయా జిల్లాల్లో మూల్యాంకనం జరిగిన తర్వాత ఆ విద్యార్థి వేరు వేరు సబ్జెక్టులలో పొందిన మార్కుల ఆధారంగా ఆ విద్యార్థి ఫలితాన్ని నిర్ణయిస్తారు. ఈ సంవత్సరం దాదాపు 5 లక్షల మంది పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. వారికి సంబంధించిన 30 లక్షల(ఆరు సబ్జెక్టులు) మార్కుల వివరాలను స్కానింగ్ చేయాల్సి ఉంటుంది.
ఈ ప్రక్రియకు కనీసం ఇరువై రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. సమాధాన పత్రాల మూల్యాంకనానికి పది రోజులు, ఫలితాల వెల్లడికి 20 రోజులు ఇలా మొత్తంగా 30 రోజుల సమయం పడుతోంది. అంటే జూలై మొదటి వారంలో పదోతరగతి ఫలితాలు విడుదలయ్యే అవకాశమున్నట్లు ఉపాధ్యాయులు చెప్తున్నారు. ఫలితాల అనంతరం మెమోలు ప్రింటింగ్ చేయడానికి, వాటిని పాఠశాలలకు పంపిచడానికి మరో 15 నుంచి 20 రోజుల సమయం తీసుకుంటుంది. ఈ లెక్కప్రకారంగా చూసుకుంటే జూలై చివరి వారం లేదా ఆగస్టులో తప్ప టెన్త్ పాసైన విద్యార్థి ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో లేదా పాలిటెక్నిక్, ఇతర కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉండదు. కానీ సీబీఎస్‌ఈ విధానంలో చదివే విద్యార్థులకు ఏప్రిల్‌లో పరీక్షలు మొదలవుతాయి. ప్రైవేట్ కళాశాలలన్నీ మే 25 నుండి వివిధ కోర్సుల పేర్లతో తరగతులు ప్రారంభించే విధంగా ఇప్పటికే ప్రణాళికలు వేసుకున్నాయి. కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన విపత్కర పరిస్థితులతో గత రెండు సంవత్సరాలుగా విద్యా సంవత్సరాలను నష్టపోయిన విద్యార్థులకు కనీసం 2022-23 విద్యా సంవత్సరాన్నైనా పూర్తి స్తాయిలో నిర్వహించాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఇంటర్ విద్యార్థులకు జూన్1న ప్రారంభం కావాల్సిన విద్యా సంవత్సరాన్ని పదో తరగతి పరీక్షలు ఆలస్యంగా నిర్వహిస్తుండటంతో ఇంటర్ ఫస్ట్ ఇయర్ తరగతులు మరింత ఆలస్యం కానున్నాయి.
ఎస్‌ఏ-2 పరీక్షలపై స్పష్టత కరువు….
1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్‌ల్లో జరిగే ఎస్‌ఏ-2 పరీక్షలపై అధికారుల నుంచి స్పష్టత లేదు. గతంలో విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 7 నుంచి ఎస్‌ఏ-2 పరీక్షలు ఉంటాయని అధికారులు ప్రకటించారు. అయితే పరీక్షలకు సబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉన్నా అది ఇంకా ముందుకుసాగలేదు. దీంతో ఏప్రిల్ 7 నుంచి ఎస్‌ఏ-2 పరీక్షలు జరిగే అవకాశంలేదని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. రీషెడ్యూల్ ప్రకటించాల్సి ఉంటుందని అంటున్నారు. అలాగే ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి పనిరోజు ఏప్రిల్ 23 వరకే. అయితే పదో తరగతి పరీక్షలు మాత్రం మే 23 నుంచి జూన్ 1 వరకు ఉన్నాయి. మరీ ఏ తరగతి ఉపాధ్యాయులు పరీక్షలు పూర్తయ్యేంత వరకు వెళ్లాలా లేదా? అనే దానికి సంబంధించి స్పష్టతలేదు. దీంతో ఉపాధ్యాయుల్లో గందరగోళం ఏర్పడింది. దీనిపై స్పష్టత ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. అదేవిధంగా ఎండల తీవ్రత నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను ఏప్రిల్‌ల్లో నిర్వహించాలని ఉపాధ్యాయులు, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..