రాష్ట్రంలో కరోనా నివారణకు వచ్చే మూడు, నాలుగు వారాలు కీలకమని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, మే నెలాఖరు వరకు అందరూ జాగ్రత్తలు పాటించాలన్నారు. మాస్కు తప్పనిసరిగా ధరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 45 లక్షల మందికి టీకా ఇచ్చామన్నారు. కరోనా నివారణ కోసం ప్రజలు సంపూర్ణంగా సహకరిస్తున్నారన్నారు.
వారం రోజులుగా తెలంగాణలో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో స్థిరత్వం ఉందన్నారు. పాజిటివ్ కేసుల్లో 80 -90 శాతం వరకు ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం రాదని, కేవలం 10 శాతం మందికే ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం వస్తుందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 95 శాతం వరకు రికవరీ రేటు ఉందన్నారు. మొదటి దశలో దేశంలోనే అత్యధికంగా 99.5 శాతం రికవరీ రేటు తెలంగాణ రాష్ట్రానికి ఉందని ఆయన పేర్కొన్నారు.