తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1000 మత్స్య సహకార సంఘాలు ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. కొత్త సభ్యత్వాల ప్రక్రియను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 18 ఏళ్లు నిండిన మత్స్యకారులకు మార్కెటింగ్ సొసైటీల్లో సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి హరీశ్ తెలిపారు. మత్స్య సంపదను ఏర్పాటు చేయాలని కొంతకాలంగా మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కొత్తగా ఏర్పాటైన 650 మత్స్య సహకార సంఘాల సభ్యులకు నైపుణ్య పరీక్షలు పూర్తయ్యాయనీ, మరో 334 సొసైటీల నమోదు ప్రక్రియ పూర్తయిందని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన సమావేశంలో మంత్రి హరీశ్ రావు తెలిపారు. నీటి వనరులు లేకపోవడంతో గతంలో మత్స్యకార సొసైటీల్లో రెండున్నర ఎకరాలకు ఒక సభ్యుడిని ఎంపిక చేసేవారు.. అయితే ఇప్పుడు నీటి వనరులు పెరగడంతో ఎకరానికి ఒక సభ్యుడిని ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. 650 మత్స్య సహకార సంఘాల్లో 13,900 మందికి సభ్యత్వం లభించిందనీ, మరో 334 సంఘాలు సభ్యత్వం కోసం స్కిల్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నాయని ఆయన తెలిపారు.