Tuesday, November 26, 2024

భారత్ లో కరోనా విలయం.. న్యూయార్క్ టైమ్స్ కథనం!

ఒక్క కథనం.. ఒక్కే ఒక్క కథనం భారత్ లో నెలకొన్న తాజాగా మహమ్మారి పరిస్థితిని అగ్రరాజ్యం అమెరికా కళ్లకు కట్టింది. భారత్ లో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చుతోంది. మునుపెన్నడూ లేని విధంగా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ప్రతిరోజు మూడు లక్షలపైనే కేసులు నమోదు అవుతున్నాయి. అంతేకాదు మరణాల సంఖ్య కూడా పెరగడంతో భారత్ లోని పరిస్థితిని చూసిన పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.ఈ క్రమంలో బ్రిటన్ సహా అనేక దేశాలు భారత్ కు మద్దతుగా ఉంటామని ప్రకటించాయి. భారత్ కు ఎలాంటి సాయమైనా చేస్తామని పులుపునిచ్చాయి. భారత్ కు అవసరమైన ఆక్సిజన్ ను భారత్ కు పంపుతున్నాయి. చివరికి దాయాది దేశమైన పాక్ కూడా భారత్ త్వరగా కోలుకోవాలంటూ సానుభూతి ప్రకటించింది.

అయితే కరోనా మహమ్మారి అమెరికాపై విరుచుకుపడిన సమయంలో భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యాక్సిన్ కు కావాల్సిన ముడి సరుకుని పంపింది. భారత్ చేసిన సాయానికి అప్పట్లో అధ్యక్షుడు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. కానీ ప్రస్తుతం భారత్ లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. వ్యాక్సిన్ తయారికి కావాల్సిన ముడిసరుకు పై నిషేధం ఎత్తివేయాలని కోరింది. అయితే అమెరికా మాత్రం ముడిసరుకుపై నిషేధం ఎత్తివేసేందుకు తాము సిద్దంగా లేమని స్పష్టం చేసింది. తమకు ముందు అమెరికన్స్ ముఖ్యమని తరువాత ఇతరులని ప్రకటించింది. దాంతో అమెరికా పద్దతి బాలేదని ఇదేనా మీ సంస్కారం అంటూ విమర్శలు వినిపించాయి. ఈ క్రమంలో న్యూయార్క్ టైమ్‌ పత్రిక భారత్ లో ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితిపై 8 పేజీల కథనాన్ని ప్రచురించింది.

ఒకవైపు కరోనా భయం ప్రజల్లో హడలెత్తిస్తుంటే మరోవైపు కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారికి అంత్యక్రియల నిర్వహణ కరవవుతోంది. తమ సొంత వారైనా బంధువులైనా కరోనాతో మరణిస్తే.. కనీసం చివరి చూపుకు కూడా రావడం లేదు. కరోనా మృతుల దహన సంస్కారాలు నిర్వహించేందుకు అయితే పూర్తి వెనకడుగు వేస్తున్నారు. చనిపోయిన వారినుంచి కరోనా తమకు ఎక్కడ అంటుకుంటుందోనని భయంతో వెనకడుగు వేస్తున్నారు. దీంతో మున్సిపాలిటీ సిబ్బందే కరోనా శవాలకు అంత్యక్రియలు నిర్వహించాల్సి వస్తోంది. దేశంలో కరోనా మృతుల అంత్యక్రియలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శ్మశానాల్లో ఖాళీ లేకపోవడంతో మృతదేహాన్ని రెండు రోజులపాటు ఇంట్లోనే పెట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా మృతదేహాల ఖననానికి  కట్టెల కొరత తీవ్రంగా మారింది.

డిమాండ్‌కు తగ్గట్టు కట్టెలను వ్యాపారులు అందించలేకపోతున్నారు.  ఢిల్లీలోని సీమాపురి శ్మశాసనవాటికలో అంత్యక్రియలకు చోటులేక పార్కింగ్ స్థలంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సామూహిక దహనవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. కిక్కిరిసిన శ్మశానాల్లో కోవిడ్ మృతుల అంత్యక్రియలు, ఆస్పత్రుల బయట మృతదేహాల కోసం ఎదురుచూసే కుటుంబాలు, శ్వాస అందని రోగులతో ఆస్పత్రుల బయట నిలిచిన అంబులెన్సులు, శవాలతో నిండిన మార్చురీ నిండిపోతోంది.

కొన్ని ఆస్పత్రుల్లోని కారిడార్లలో, వరండాల్లో ఒకే బెడ్ మీద ఇద్దరు రోగులు ఉండడం కూడా కనిపిస్తోంది. ఆస్పత్రుల్లో పడకల కోసం, మందుల కోసం, ఆక్సిజన్ సిలిండర్ల కోసం, ముఖ్యంగా పరీక్షల చేయించుకోడానికి సాయం చేయాలంటూ ఎంతోమంది దీనంగా వేడుకుంటున్నారు. దేశంలో గత వారానికి 10 కోట్లకు పైగా డోసులు వేయగలిగినప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో టీకా కొరత తీవ్రంగా ఉంది. జూన్ లోపు తాము టీకా సరఫరాను పెంచలేమని ప్రపంచ అతిపెద్ద టీకా తయారీ సంస్థ, భారత్‌లోని సీరం ఇన్‌స్టిట్యూట్ తేల్చి చెప్పింది. ఎందుకంటే దానికి తగ్గట్టు తన సామర్థ్యాన్ని విస్తరించడానికి అవసరమైన నిధులు ఆ సంస్థ దగ్గర లేవు. దేశంలో టీకా డోసులు అత్యవసరం కావడంతో, ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కరోనావైరస్ వ్యాక్సీన్ ఎగుమతుల మీద భారత్ తాత్కాలిక నిషేధం విధించింది. విదేశీ టీకాల దిగుమతులను కూడా అనుమతించింది. దేశంలో ఆక్సిజన్‌కు డిమాండ్ పెరుగుతుండడంతో, దానిని కూడా దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు భారత్ లో ఉన్న పరిస్థితిపై న్యూయార్క్ టైమ్ కథనం పేర్కొంది.

- Advertisement -

ఇది అమెరికన్లను కదిలించింది. అక్కడి ప్రవాస భారతీయులు, అమెరికన్లు ఇండియా పరిస్థితిపై షాక్ కి గురైయ్యారు. అంతేకాదు ఆదేశ అధ్యక్షుడు జో బైడెన్ పై ఒత్తిడి పెరిగెలా చేసింది. భారత్ కు అవసరమైన సహాయం చేస్తామని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. కరోనా మొదటి వేవ్ సమయంలో అమెరికాకు ఇండియా సహాయం చేసిందని, సెకండ్ వేవ్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత్ కు తాము తప్పకుండా సహాయం చేస్తామని చెప్పారు. కోవిషీల్డ్ తయారీకి అవసరమైన ముడి పదార్థాల ఎగుమతిపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా కట్టడికి భారత ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేర్కొన్నారు. మొత్తం మీద న్యూయార్క్ టైమ్స్ కథనం అమెరికాలో మార్పు తీసుకొచ్చింది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement