Saturday, November 23, 2024

Spl Story | న్యూయార్క్‌ సిటీ మునుగుతోంది.. కాంక్రీట్ జంగిల్‌కి డేంజ‌ర్ డేస్‌!

న్యూయార్క్ సిటీ అంటే ఎంతో డెవ‌ల‌ప్ చెందిన సిటీగా ప్రాచుర్యం ఉంది.. అయితే అట్లాంటి గొప్ప న‌గ‌రానికి ఇప్పుడు డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయి. ఎందుకంటే.. కాంక్రీట్ జంగిల్‌గా మారిన న్యూయార్క్ సిటీ.. భూమికి మించిన భార‌మ‌య్యింద‌ని, అందుక‌ని అక్క‌డి గ్రామాలు, ప‌ట్ట‌ణాలు ముంపున‌కు గుర‌వుతున్నాయి ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు చెబుతున్నారు.

– ఇంట‌ర్నెట్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ‌

భూతాపం కారణంగా సముద్ర మట్టాలు పెరిగి ప్రపంచంలోని అనేక తీర ప్రాంత గ్రామాలు, పట్టణాలు భవిష్యత్‌లో ముంపునకు గురువుతాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. అయితే, మిగతా పట్టణాలతో పోలిస్తే, మూడురెట్ల వేగంగా న్యూయార్క్‌ సిటీ మునిగిపోతుందని తాజా పరిశోధనల్లో తేలింది. ప్రపంచంలో ఏ నగరంలోనూ లేని విధంగా ఆకాశహర్య్మాలతో కాంక్రీట్‌ జంగిల్‌ను తలపించేలా న్యూయార్క్‌ సిటీ అభివృద్ధి చెందింది. అయితే అక్కడి నేల తట్టుకోలేనంత బరువుతో ఆ భవనాలు కట్టేశారు. ఫలితంగా నెమ్మదిగా కుంగటం మొదలైంది. స్పష్టంగా చెప్పాలంటే… మన ఉత్తరాఖండ్‌లోని జోషి మఠ్‌ కుంగిపోయి ఇళ్లు బీటలవారి, నేల నెఱ్రలువీరిన తీరులో న్యూయార్క్‌ శిథిలమవబోతోందన్నమాట. కాకపోతే జోషిమఠ్‌ పర్వత సానువుల్లో ఉంది. న్యూయార్క్‌ సిటీ సముద్రతీరంలో ఉంది.

అడ్వాన్సింగ్‌ ఎర్త్‌ అండ్‌ స్పేస్‌ సైన్స్‌ జర్నల్‌లో ఇటీవల న్యూయార్క్‌ సిటీ ముంపునకు సంబంధించిన పరిశోదనా పత్రం ప్రచురితమైంది. సముద్రమట్టాలు పెరగడం, నగరంలో కాంక్రీట్‌ నిర్మాణాల బరువును అక్కడి నేల తట్టుకోలేకపోవడం, తరచూ తుపానుల తాకిడి పెరగడం వంటి ప్రకృతి పరమైన మార్పులు న్యూయార్క్‌ను ముంచేయనున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రపంచంలోని తీర ప్రాంత గ్రామాలు, నగరాలు ముంపునకు గురయ్యే అంశంపై యూనివర్శిటీ ఆఫ్‌ రోడ్‌ ఐలండ్‌కు చెందిన గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీకి చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు.

- Advertisement -

ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో కన్నా న్యూయార్క్‌ నగరమే తొందరగా ముంపునకు గురవుతుందని వారు అంచనా వేశారు.
80 లక్షలమంది నివసిస్తున్న ఈ నగరం అమెరికా సంయుక్త రాష్ట్రాలలో జనసాంద్రత అత్యధికగా ఉన్న ప్రాంతం. నైసర్గికంగా విభిన్నంగా ఉంటుంది. ఇక్కడి భూ ఉపరితలం ఎక్కువగా బురద, ఇసుక, బంకమట్టి, మంచుతో కూడి ఉంటుంది. ఉత్తర అమెరికాలోని అట్లాంటిక్‌ మహాసముద్రతీరంలోని ఇతర ప్రాంతాలకన్నా మూడునాలుగు రెట్లు ఎక్కువగా, వేగంగా ఇక్కడ సముద్రమట్టం పెరుగుతోంది. ఫలితంగా వరదల తాకిడి ఎక్కువగా ఉంటోంది. పరిస్థితులు ఇలాగే ఉంటే 2100 నాటికి 50 నుంచి 150 సెం.మీ. మేర ఇక్కడ సముద్రజలమట్టం పెరిగి మహానగరం ముంపునకు గురవుతుందని ఆ పరిశోధనా పత్రం పేర్కొంది.

తీరప్రాంతాల్లో ఆకాశహర్మ్యాల నిర్మాణం వల్ల భవిష్యత్‌లో వరదలు ముంచెత్తడానికి కారణమవుతాయని హెచ్చరించింది. న్యయార్క్‌లో లక్షలాది ఆకాశహర్మ్యాలు కట్టారు. వాటి పునాదులు ఎంతమేర తవ్వారో తెలీదు. నగరంలోని భూ ఉపరితలం గుల్లబారిపోయింది. భవిష్యత్‌ ఎలా ఉండబోతోందో ప్రకృతి ఇప్పటికే రుచిచూపించింది. 2012లో హరికేన్‌ శాండీ ధాటికి సముద్రజలాలు నగరంలోకి వచ్చేశాయి. 2021లో హరికేన్‌ ఇడా సమయంలో భారీ వర్షాలవల్ల అక్కడి డ్రెయినేజ్‌ వ్యవస్థ ధ్వంసమైంది. నగరం అంతా పిల్లకాలవలతో, దీవులతో ఉన్నట్లు ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement