Friday, November 22, 2024

స‌వాలు విసురుతున్న కొత్త వేరియంట్లు.. బ్రేక్ త్రూ ఇన్‌ఫెక్ల‌న్ల‌తో మ‌రింత ఇమ్యూనిటీకి..

కరోనా కొత్త వేరియంట్లు శాస్త్రవేత్తలకు సవాలు విసురుతున్నాయి. వ్యాక్సిన్ వేసుకున్న‌ వారు కూడా కొత్త‌ వేరియంట్‌ల బారిన పడటం (బ్రేక్‌ త్రూ ఇన్‌ఫెక్షన్లు) ఆందోళన కలిగిస్తోందంటున్నారు సైంటిస్టులు. అయితే బ్రేక్‌ త్రూ (break through) ఇన్‌ఫెక్షన్ల బారిన పడడం వల్ల భవిష్యత్‌లో రాబోయే వేరియంట్లను ఎదుర్కొనే విధంగా శరీరంలోని రోగనిరోధక ప్రతిస్పందనలు వృద్ధి చెందుతాయని పరిశోధనలో వెల్లడైందంటున్నారు. డెల్టా వేరియంట్‌పై నిర్వహించిన ఈ పరిశోధన జర్నల్‌ ఆఫ్‌ అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (JAMA)లో ప్రచురితమైంది.

వ్యాక్సిన్‌ తీసుకున్నాక కరోనా బారిన పడినప్పుడు వ్యాధి నిరోధక ప్రతి స్పందన వేగంగా వృద్ధి చెంది, సార్స్‌కోవ్‌-2 ఇతర మ్యుటేషన్లను సైతం ఎదుర్కొనే సామర్థ్యం వస్తుందని అమెరికాకు చెందిన ఒరిజాన్‌ హెల్త్‌ అండ్‌ సైన్స్‌ యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పికాడు టఫెస్సే, మరో పరిశోధకుడు మార్కెల్‌ కర్లిన్‌లు తెలిపారు. వ్యాక్సిన్లు తీసుకున్నాక కరోనా బారిన పడిన వారి నుండి తీసుకున్న రక్తనమూనాలను పరిశీలించినప్పుడు మెరుగైన రోగనిరోధక ప్రతిస్పందనలను గుర్తించినట్లు తెలిపారు.

అధ్యయనంలో భాగంగా మొత్తం 52 మంది నుండి రక్తనమూనాలను సేకరించామని అన్నారు. బ్రేక్‌ త్రూ ఇన్‌ఫెక్షన్ల వల్ల యాంటీబాడీలు మరిన్ని ఎక్కువ విడుదల అవుతాయని ఈ పరిశోధనలో తేలిందని అన్నారు. దీర్ఘకాలంలో కరోనా ఎపిడమిక్‌ (అంటువ్యాధి)గా మారడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. దీంతో ఈ వైరస్ ను అంతం చేయాలంటే వ్యాక్సిన్‌ ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. ఒకసారి వ్యాక్సిన్‌ వేసుకుంటే వైరస్‌ నుంచి రక్షణ పొందినట్లేనని కర్లిన్‌ తెలిపారు. అయితే ప్రత్యేకించి ఒమిక్రాన్‌ వేరియంట్‌పై అధ్యయనం చేపట్టలేదని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement