స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగుతుండగా.. ఓ ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటానని శనివారం ఉదయం రాసిన లేఖ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. స్టీల్ ప్లాంట్‌లో ఫోర్‌మెన్‌గా పనిచేసే శ్రీనివాసరావు లేఖరాసి అదృశ్యం కావడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదుచేసిన దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాసరావు కదలికలపై దృష్టి సారించిన పోలీసులు.. సెల్ ఫోన్ కాల్ లిస్ట్, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే, ఈ వ్యవహారంలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అసలు అతడి అదృశ్యం వెనుక వేరే కారణాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాల ఇప్పిస్తామని నమ్మించి పలువురి వద్ద డబ్బులు వసూలు చేసినట్టు తెలిపారు. శుక్రవారం ఇద్దరు వ్యక్తులతో శ్రీనివాసరావు సుదీర్ఘంగా సంభాషించాడు. ఆరా తీయగా ఉద్యోగాల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు రుజువు అయ్యింది. దీంతో బాధితులకు సమాధానం చెప్పలేక పరారు అయ్యాడా? అని అనుమానం వ్యక్తమవుతోంది. నిజంగానే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై ఆత్మహత్యకి పాల్పడ్డాడా అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. స్టీల్ ప్లాంట్ నుంచి శ్రీనివాసరావు బయటకు వెల్లునట్లు పోలీసులు గుర్తించారు.
గాజువాకకు చెందిన శ్రీనివాసరావు ఉక్కు ఫర్నేస్‌లో అగ్నికి ఆహుతవుతానంటూ లేఖ రాసి మిస్సింగ్ అయ్యాడు. అతడి టేబుల్ వద్ద ఐడీ కార్డు, పర్సు, మొబైల్ ఫోన్, ఆత్మహత్య లేఖను గుర్తించారు. ఈ పోరాటం తన ప్రాణత్యాగం నుంచి మొదలు కావాలని.. కార్మికులంతా కలిసికట్టుగా ఉంటేనే విజయం సాధిస్తామని శ్రీనివాసరావు లెటర్లో పేర్కొన్నాడు. కేసు దర్యాప్తులో భాగంగా కార్మికుల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. ఈ క్రమంలో అతడు ఉద్యోగాల పేరుతో కొందరిని నమ్మించినట్టు వెల్లడయ్యిందని పోలీసులు తెలిపారు.