విశాఖ జిల్లా పెందుర్తు మండలం జుత్తాడ ఘటన కేసులో కొత్త మలుపులు తిరుగుతోంది. ఆరుగురిని హత్య చేసిన నిందితుడు బత్తిన అప్పలరాజును 14 రోజుల రిమాండ్ విధించారు. కేజీహెచ్‌లో వైద్య పరీక్షల నిర్వహించి అనంతరం అతడ్ని జైలుకు తరలించారు. నిందితుడు ఆస్పత్రికి వచ్చిన సమయంలో ఈ హత్యలు ఎందుకు చేశావని నిందితుడ్ని మీడియా ప్రశ్నించగా.. తన కన్న కూతుర్ని లైంగికంగా వేధించడంతో ఈ హత్యలు చేశానని బదులిచ్చాడు.
మరోవైపు తన ఇంటిని అమ్మలేదనే కక్షతోనే ఆ రాక్షసుడు ఇంత దుర్మార్గానికి పాల్పడ్డాడని అంటున్నాడు విజయ్. అప్పలరాజు కబ్జాలను అడ్డుకున్నందుకే కూతుర్ని అడ్డుపెట్టుకొని తనపై అక్రమ కేసు పెట్టించారని ఆరోపించాడు. అప్పలరాజు కూతురితో తనకు ఎలాంటి సంబంధంలేదన్నారు. పక్కా పథకంతో తన కూతురితో చాటింగ్ చేయించాడన్నారు. తన భార్య అవహేళన చేసిందనడంలో ఏమాత్రం నిజంలేదన్నాడు. తనపై పెట్టిన రేప్ కేసు పక్కా ఫాల్స్ అని తెలిపాడు.
విశాఖ జిల్లా జుత్తాడలో రమణ కుటుంబ సభ్యుల్లో ఆరుగురిని అప్పలరాజు నరికి చంపిన సంగతి తెలిసిందే. అప్పలరాజు ఊచకోతలో విజయ్ తండ్రి రమణ, విజయ్ భార్య ఉషారాణి, ఆమె తల్లి రమాదేవి, పిన్ని అరుణ, మరో ఇద్దరు పిల్లలు హత్యకు గురయ్యారు. ఆ సమయంలో విజయ్ ఇంట్లో లేకపోవడంతో తప్పించుకున్నాడు. ఈ ఘటన విశాఖ జిల్లాలో సంచలనం రేపింది. కాగా, అప్పలరాజు ఉన్మాదానికి విజయ్ కుటుంబం అంతా తుడిచి పెట్టుకుపోయింది. విజయ్, పెద్ద కొడుకు మాత్రమే బతికాడు. అమ్మలేదని..ఇక రాదని తల్లడిల్లుతున్న ఆ పిల్లాడి ఆవేదన అంతా ఇంత కాదు. చెల్లి లిషత లేదు.. నాకెవరు రాఖీ కడుతారన్న ఈ పసి మనసు ఆవేదన ప్రతీ ఒక్కర్నీ కన్నీరు పెట్టిస్తోంది.