అది జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ జంక్షన్.. పంజాగుట్ట నుంచి పెద్దమ్మ గుడి దారిలో వెళ్లేవారికి సిగ్నల్ వద్ద తప్పకుండా ఆగాల్సి ఉంటుంది. అయితే.. పంజాగుట్ట నుంచి ఫిలింనగర్ వెళ్లే వేహికల్స్ మాత్రం ఫ్రీ లెఫ్ట్ రూట్లో ఈజీగా వెళ్లాలి. కానీ, అక్కడ మొత్తం వాహనాలన్నీ నిలిచిపోయి.. ఫ్రీ లెఫ్ట్ని బ్లాక్ చేసేస్తుంటారు. ఇక వెనక నుంచి వచ్చిన వాహనదారులకు దిగి ముందు రోడ్ బ్లాక్ చేసిన వారిని చితకబాదాలన్న కోపం వస్తుంది. పెద్ద పెద్దగా హారన్ కొట్టినా ఎవరూ పట్టించుకోరు. ఇట్లానే కేబుల్ బ్రిడ్జికి వెళ్లే దారిలో ఉన్న జంక్షన్‌లోనూ ఇట్లాంటి పరిస్థితే ఎదురవుతుంది. అయితే.. ఇవి మాత్రమే అని కాదు.. సిటీలో ఉన్న చాలా సెంటర్ల నుంచి ఇట్లాంటి ఫిర్యాదులు వస్తున్నాయి. హైదరాబాద్ సిటీ పోలీసులకు పెద్ద ఎత్తున అందుతున్న ఇట్లాంటి కంప్లెయింట్స్తో ఫ్రీ రూట్ బ్లాక్ చేసే వారిపై భారీగా ఫైన్ వేసేలా చర్యలు తీసుకోబోతున్నారు. ఇది కాస్త అందరికీ అర్థమైతే ఈ సమస్య ఉండదు.
– డిజిటల్ మీడియా, ఆంధ్రప్రభ
హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ పోలీసులు కొత్త నిబంధనలను అమలు చేయనున్నారు. ఇప్పటిదాకా లైసెన్స్ లేకున్నా, హెల్మెట్ లేకున్నా, కారులో సీటు బెల్ట్ పెట్టుకోకున్నా, మితి మీరిన వేగంతో దూసుకెళ్లినా, నో పార్కింగ్ జోన్‌లో వాహనాలు నిలిపినా.. జరిమానాలు విధించిన ట్రాఫిక్ పోలీసులు ఇకపై సరికొత్త నిబంధనలు అమలులోకి తీసుకురానున్నారు. ఈ కొత్త నిబంధనలు అతిక్రమించిన వారిపై పెద్ద మొత్తంలో ఫైన్ పడబోతోంది.
కాగా, కొత్త నిబంధనల్లో భాగంగా ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర వాహనదారులు నిర్దేశిత నిబంధనలు పాటించాల్సిందేనని ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. సిగ్నళ్ల వద్ద స్టాప్ లైన్ దాటితే రూ.100 జరిమానా విధించనున్నారు. అదే సమయంలో ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ చేస్తే ఏకంగా రూ.1,000 జరిమానా విధించనున్నారు. ఇక పాదచారులకు అడ్డంగా వాహనాలు నిలిపే వారికి రూ.600 జరిమానా విధించనున్నారు. ఫుట్‌పాత్‌లపై వస్తువులు పెట్టే దుకాణదారులపైనా భారీగా జరిమానాలు విధించేందుకు ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. తక్షణమే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని పోలీసులు తెలిపారు.