తెలంగాణ ఏపీ మధ్య కొత్త రైల్వే లైన్
₹2,115 కోట్లతో పనులు చేపట్టేందుకు సన్నాహాలు
2030 వరకు పూర్తి కానున్న రైల్వే లైన్ పనులు
హైదరాబాద్-విశాఖ మధ్య తగ్గనున్న ధూరం
150 కిలోమీటర్లు కలిసి వస్తుందంటున్న ప్రయాణికులు
1984లోనే కొవ్వూరు రైల్వే సాధనా కమిటీ ఏర్పాటు
కొత్తగూడెం నుంచి కొవ్వూరుకు 22 రోజుల పాదయాత్ర
ఇన్నాళ్లకు లభించిన మోక్షం.. ప్రజల్లో సంతోషం
ఆంధ్రప్రభ స్మార్ట్, సెంట్రల్ డెస్క్:
కొత్తగూడెం, కొవ్వూరు రైల్వేలైన్ నిర్మాణం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నిర్మాణానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఈ లైన్ నిర్మాణం పూర్తయితే.. హైదరాబాద్, విశాఖ మధ్య దాదాపు 150 కిలోమీటర్ల దూరం తగ్గనుంది.
సర్వేల పేరుతో కాలయాపన..
1964లో ఈ లైన్ నిర్మాణానికి బీజం పడింది. కానీ, ఇప్పటివరకు ప్రభుత్వాలన్నీ ప్రకటనలకే పరిమతమయ్యాయి. తెలంగాణ ఎంపీలు పార్లమెంట్ ఈ విషయం ప్రస్తావించినప్పుడు మాత్రమే కాస్త కదలిక వస్తోంది. ఆ తర్వాత అధికారులు సర్వేల పేరుతో దాటవేస్తూ వస్తున్నారు. అయితే.. ఇప్పుడు కూడా ఈ లైన్ విషయంలో కాస్త ఆశలు మొదలైనా, మళ్లీ పాత కథే ఉంటుందా అనే అనుమానాలు చాలామంది నుంచి వస్తున్నాయి.
2,115 కోట్లతో పనులు..
ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఈ రైల్వే లైన్ గురించి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టత ఇచ్చారు. రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ₹2,115 కోట్లతో ఈ ప్రాజెక్టును 2030 నాటికి పూర్తిచేస్తామని సమాధానమిచ్చారు.
1984లోనే రైల్వే సాధన కమిటీ..
కొత్తగూడెం -కొవ్వూరు రైల్వేలైన్ నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా.. 1984లో కొవ్వూరు రైల్వేలైన్ సాధన కమిటీ ఏర్పాటైంది. పాండురంగాచార్యులు అధ్యక్షతన ఏర్పడిన ఈ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చంద్రుగొండ, అశ్వారావుపేట, సత్తుపల్లి, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు ప్రాంతాలకు ఈ కమిటీని విస్తరించింది. 2014 జనవరిలో నుంచి 22 రోజుల పాటు కొత్తగూడెం నుంచి కొవ్వూరు వరకు పాదయాత్ర కూడా నిర్వహించారు.
రెండు రాష్ట్రాల మధ్య తగ్గనున్న దూరం..
కొత్తగూడెం- కొవ్వూరు రైల్వేలైన్ పూర్తయితే హైదరాబాద్- విశాఖ మధ్య 150కి.మీ. దూరం తగ్గుతుంది. 2.30 గంటల జర్నీ సమయం ఆదా అవుతుంది. ప్రస్తుతం హైదారాబాద్ నుంచి విశాఖకు విజయవాడ మీదుగా వెళ్తే 800కి.మీ. ప్రయాణించాలి. అదే కొత్తగూడెం- కొవ్వూరు లైన్ పూర్తయితే హైదరాబాద్ నుంచి విశాఖకు వయా కొత్తగూడెం అందుబాటులోకి వస్తుంది. 650 కి.మీ. ప్రయాణంతో విశాఖపట్నం చేరుకోవచ్చు.