ప్రపంచంలో ఎక్కడైనా వయసుకు పూర్తి కొలమానం ‘వందేళ్లు’గానే పరిగణిస్తుంటారు. అయితే వందేళ్లు కాదు.. 150 ఏళ్లు జీవించ వచ్చని సింగపూర్‌కు చెందిన జెరో అనే బయోటెక్ సంస్థ పరిశోధకులు చెప్తున్నారు. మనిషి గరిష్ఠంగా ఎన్నేళ్లు బతకవచ్చు అన్నదానిపై అధ్యయనం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఓ మనిషి గరిష్ఠంగా 120 నుంచి 150 ఏళ్ల దాకా బతకడానికి అవకాశాలున్నాయని లెక్క తేల్చారు.
అయితే ఎన్నేళ్లు బతికినా మరణం అనేది తప్పదని, మనం ఎదుర్కొనే ఒత్తిళ్లు, నడక, చేసే పనుల మీదే అది ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. మన గరిష్ఠ వయసును నిర్ధారించేందుకు పరిశోధకులు రక్త కణాలు, ప్రజలు రోజూ చేస్తున్న పనులను విశ్లేషించారు. అమెరికా, బ్రిటన్, రష్యాకు చెందిన ప్రజలపై అధ్యయనం నిర్వహించారు. వయసు పెరిగే కొద్దీ శరీరంలోని రక్తకణాలు తరగడం మొదలవుతుందని, ఆ రక్తకణాలు ఎంత వేగంగా తగ్గిపోతే అంత వేగంగా వృద్ధాప్యం వస్తుందని, అంతే త్వరగా మరణమూ సంభవిస్తుందని తేల్చారు. ఈ లెక్కన 120 నుంచి 150 ఏళ్ల మధ్యే రక్తకణాలు చాలా వరకు తగ్గిపోయి శరీర పటుత్వం పడిపోతుందని పేర్కొన్నారు.
అయితే.. మరో షాకింగ్ విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. 30 నుంచి 40 ఏళ్ల మధ్యే రక్తకణాలు తగ్గడం మొదలవుతుందని తేల్చారు. తద్వారా శరీరం కొద్దికొద్దిగా శక్తిని కోల్పోతుంటుందని వివరించారు. ఆ వయసులో ఎదుర్కొనే ఒత్తిళ్లూ అందుకు కారణమవుతున్నాయని చెబుతున్నారు. దీన్ని బట్టి వయసు సంబంధిత వ్యాధులను నయం చేసుకోవడానికి ఇప్పుడున్న చికిత్సలతో మహా అయితే కొన్నేళ్లు వయసును పెంచుకోవచ్చుగానీ.. గరిష్ఠ వయసు వరకు బతకడం మాత్రం కష్టమన్నారు. అలా బతకాలంటే ప్రభావవంతమైన చికిత్సలు రావాల్సిన అవసరం ఉందని అమెరికాలోని రోజ్ వెల్ కాంప్రహెన్సివ్ కేన్సర్ సెంటర్ కు చెందిన ఆండ్రీ గుడ్కోవ్ చెప్పారు. ఈ పరిశోధనతో వృద్ధాప్యాన్ని తగ్గించే మంచి ఔషధాలను అభివృద్ధి చేసేందుకు అవకాశం దొరుకుతుందన్నారు.