Friday, November 22, 2024

Big Story: దళితబంధు తరహాలో బీసీలకు కొత్త స్కీం?.. బడ్జెట్‌ సమావేశాల్లో ప్రకటించే అవకాశం

కొత్త పథకాలు, ప్రజావసరాలు, ఆరోగ్య, సంక్షేమ రంగాలే ప్రాధాన్యతలుగా వార్షిక బడ్జెట్‌ తుది దశకు చేరింది. గవర్నర్‌ నోటిఫికేషన్‌తో బడ్జెట్‌ సమావేశాలకు ప్రభుత్వం చేరువవుతోంది. రాష్ట్ర ప్రజల జీవికను నిర్వచించుకున్న అనంతరమే ప్రజల అవసరాలను అన్ని రంగాలవారీగా పరిశీలించిన తర్వాతే తుది బడ్జెట్‌ రూపకల్పనను సర్కార్‌ పూర్తి చేసింది. ఈ మేరకు 2022-23 వార్షిక బడ్జెట్‌ రూపకల్పన అంచనాలు పక్కాగా తయారవుతున్నాయి.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఈ బడ్జెట్‌లో దళితబంధుతోపాటు మరో కొత్త పథకానికి భారీగా నిధులు కేటాయించనున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. పథకాలకు కేటాయింపులే కాకుండా వ్యయం చేసేలా అంచనాలు నిక్కచ్చిగా తయారు చేస్తున్నారు. ఈ బడ్జెట్‌లో రాష్ట్ర రాబడి వనరులను పెంచుకునే మార్గాలతోపాటు పలు ఇతర పథకాలకు నిధుల కేటాయింపులు ఉండనున్నాయి. ఆర్థిక వనరుల సమీకరణ కూడా సవాలుగా మారనున్న నేపథ్యంలో ముందస్తు మార్గాలపై దృష్టి పెట్టనున్నారు. ప్రతిఏటా బడ్జెట్‌లో ఆసరా పింఛన్లకు రూ.10 వేల కోట్లు, రైతుబంధు పథకానికి రూ.15 వేల కోట్లు, రైతు బీమాకు రూ.1500 కోట్లు, రుణమాఫీకి రూ.5500 కోట్లు, ఉచిత విద్యుత్‌కు రూ.11 వేల కోట్లు, ఉద్యోగుల వేతనాలకు రూ.33 వేల కోట్లు ఖచ్చితంగా కేటాయింపులు చేయాల్సిందే. ఈ ఏడాది వీటితోపాటు యాదవులు, ముదిరాజ్‌, పద్మశాలీలకు ఇచ్చినట్లుగా ఇతర బీసీ కులాలకు, సంచార జాతులకు పథకాలు ఉండేలా చూస్తున్నారు. ఈ బడ్జెట్‌ రైతులు, దళిత వర్గాలే కీలకంగా నిధులు ఉండనున్నాయి. దళితబంధు పథకంతో బీసీల్లో ఒకింత అసంతృప్తి నెలకొంటోందని, దీనిని అధిగమించేందుకు సంచార జాతులతోపాటు, బీసీలకు నూతన పథకం ఒకటి బడ్జెట్‌లో ప్రవేశపెట్టనున్నారనే చర్చ జరుగుతోంది.

ఆర్థికాభివృద్ధి మరింత బలపడేలా…
తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మరింత బలోపేతం అయ్యే దిశగా బడ్జెట్‌ ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. గతంలో బడ్జెట్‌ రూపకల్పనపై చర్చలో భాగంగా ఆయన కేవలం ఒక్క ఏడాదికా.. లేక ఐదేళ్ల పూర్తికాలానికా అనే అవగాహనతో బడ్జెట్‌ విధివిధానాలు ఉండాలని చెప్పారు. ఐదేండ్ల తర్వాత రాష్ట్రం ఎక్కడ ఉండబోతున్నది అనే అవగాహనతో కూడిన అంచనాలతో బడ్జెట్‌ రూపొందించాలని సూచించారు. ప్రభుత్వం కేవలం చట్టాలను అమలు పర్చడమే కాకుండా రాష్ట్రాభివృద్ధిని సులభతరం చేస్తూ ఒక ఉత్ప్రేరకంగా తన పాత్రను నిర్వహిస్తుందని తెలిపారు. ఇందుకు ముందుగా సమగ్ర విధానం అవసరమని పేర్కొన్నారు. ఒక్కో అంశాన్ని తీసుకుని పనిని విభజించి, సమస్యను ఛేదించే వ్యవస్థలను ఏర్పాటు చేయాలన్నారు. ఇదే స్ఫూర్తితో ఆర్థిక శాఖ విస్తృత కసరత్తు చేసింది.
తెలంగాణ ఒక రాష్ట్రంగా తన అభివృద్ధిని పెంచుకొని, ప్రగతి మార్గంలో పయనించేందుకు అవలంభించాల్సిన మార్గదర్శకాలేమిటీ… ఆర్థిక ప్రగతికి దోహదపడుతున్న అంశాలేమిటీ.. వంటి వాటిని పరిగణలోకి తీసుకుని బడ్జెట్‌ను తయారు చేస్తున్నారు. బలాబలాలు, బలహీనతలు, మంచి చెడులు అంచనా వేసి బడ్జెట్‌ కసరత్తు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టును మార్కెట్‌ అవసరాలకు అనువుగా ఆకర్షణీయ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు నిధులు కేటాయించనున్నారు. త్రివేణీ సంగమం అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేలా కేటాయింపులు ఉండనున్నాయని తెలిసింది. కరోనా నేర్పిన పాఠాల నేపథ్యంలో ఈ దఫా ఆరోగ్య తెలంగాణ దిశగా

మానవీయ కోణంలో బడ్జెట్‌ రూపొందుతోంది.
హైదరాబాద్‌ గ్లోబల్‌ సిటీ.. దేశంలో ఏడు పెద్ద నగరాల్లో ఈ నగరం ఒకటి. ఈ నగరంలో కనీసం 100 పార్కుల అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్‌ను పరిరక్షణ, భవిష్యత్‌ తరాలను దృష్టిలో ఉంచుకుని మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేస్తున్న నేపథ్యంలో ఈ సిటీకి నిధుల కేటాయింపులు పెరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement