Saturday, November 23, 2024

టీకా తీసుకుంటే వంధ్యత్వం వస్తుందా?

కరోనా వ్యాక్సిన్‌పై కొత్త పుకారు హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే కరోనా టీకా తీసుకుంటే వంధ్యత్వం వస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పుకార్లపై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (NTAGI)కు చెందిన కొవిడ్-19 వర్కింగ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ నరేంద్ర కుమార్ అరోరా స్పందించారు. దీనిపై మరింత లోతైన వివరణ ఇచ్చారు. గతంలో పోలియో వ్యాక్సిన్‌లు వచ్చిన సందర్భంలోనూ ఈ రకమైన పుకారు వ్యాపించిందని ఆయన పేర్కొన్నారు.

పోలియో వ్యాక్సిన్ వేయించుకున్న పిల్లలు భవిష్యత్‌లో వంధ్యత్వానికి గురవుతారని ఆ సమయంలో తప్పుడు ప్రచారం జరిగింది. అన్నిటీకాలు శాస్త్రీయ పరిశోధనల చేసిన తర్వాతే అందుబాటులోకి వస్తాయనే విషయం అందరూ గుర్తించాలన్నారు. వ్యాక్సిన్‌లు ఏవీ ఈ విధమైన దుష్ప్రభావాన్ని చూపవని డాక్టర్ నరేంద్ర కుమార్ అరోరా పేర్కొన్నారు. ఇటువంటి ప్రచారం ప్రజలను తప్పుదారి పట్టిస్తుందని మండిపడ్డారు. మన సమాజాన్ని కరోనా వైరస్ నుంచి రక్షించడమే తమ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. కాబట్టి అందరూ ఎలాంటి సందేహాలకు తావివ్వకుండా ముందుకు వచ్చి కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు.

ఇది కూడా చదవండి: కరోనా థర్డ్ వేవ్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం రూ.20వేల కోట్ల ప్యాకేజీ

Advertisement

తాజా వార్తలు

Advertisement