మఫుల్ కండిషన్స్ పెట్టిన అమెరికా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ల మార్పులో నిబంధనలు
ఇప్పటిదాకా మూడుసార్లు రీ షెడ్యూల్ చేసుకునే చాన్స్
ఇక మీదట ఒకేసారికి పరిమితం చేస్తూ ఆదేశాలు
అపాయింట్మెంట్ రీ షెడ్యూల్ చేంజెస్పై కండిషన్స్
సవరణలు చేసినట్టు వెల్లడించిన అమెరికా కాన్సులేట్
జవనరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్: యూఎస్ వీసా ఆశావహులకు అమెరికా కాన్సులేట్ కీలక అప్డేట్ ఇచ్చింది. జనవరి 1వ తేదీ నుంచి అపాయింట్‌మెంట్ షెడ్యూల్ మార్పు చేసుకోవడంలో కీలక మార్పులు చేసినట్టు ప్రకటించింది. 2025 జనవరి 1 నుంచి అమలయ్యే కొత్త నిబంధనలతో వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ తేదీలను ఒక్కసారే మార్చగలరు. యూఎస్ వీసాఇంటర్వ్యూ తేదీల విషయంలో అమెరికా కాన్సులేట్ కీలక సవరణలు చేసింది. ఇకపై ఇంటర్వ్యూ తేదీలను దరఖాస్తుదారుడు ఒకసారి మాత్రమే మార్చుకోడానికి అనుమతి ఉంటుంది. నిర్ణీత ఫీజు చెల్లించి ఒకసారి మాత్రమే అపాయింట్‌మెంట్ తేదీని మార్చుకోడానికి అవకాశం కల్పిస్తారు. 2025 జనవరి ఒకటో తేదీ నుంచి నూతన నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
ఇప్పటిదాకా మూడుసార్లు చాన్స్
యూఎస్ వెళ్లాలనుకునే వారు. వీసా ఇంటర్వ్యూ కోసం తేదీ నిర్ణయించుకుని అపాయింట్మెంట్ ఎంచుకున్న తర్వాత ఇకపై దాన్ని ఒక్కసారి మాత్రమే రీ షెడ్యూల్ చేసుకునేలా నిబంధనల్లో మార్పులు చేసినట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం నాన్ ఇమిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ తేదీ ఖరారయ్యక మూడుసార్లు రీ షెడ్యూల్ చేసుకోడానికి అనుమతిస్తున్నారు. అపాయింట్‌మెంట్ తేదీలతో పాటు ఇంటర్వ్యూకు హాజరయ్యే కాన్సులేట్ కేంద్రాలను మార్చుకోడానికి అవకాశం కల్పిస్తారు. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంతో పాటు హైదరాబాద్, ముంబయి, చెన్నై, కోల్‌కత్తా నగరాల్లో ఉన్న కాన్సులేట్ కార్యాలయాల్లో ఎక్కడైనా వీసా ఇంటర్వ్యూ కేంద్రాన్ని ఎంపిక చేసుకునేందుకు వీలు కలిగేది.
అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు..
ఇకపై.. ఇలాంటి మార్పులు చేసుకోవాలంటే దరఖాస్తు చేసిన తర్వాత ఒక్కసారి మాత్రమే ఇంటర్వ్యూ తేదీని, హాజరయ్యే ప్రాంతాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. అంతకు మించి మార్పులు చేసుకోవాలంటే తిరిగి నిర్ణీత ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తులకు ఫీజుగా 185 అమెరికన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. దరఖాస్తుదారులందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు నూతన మార్పులు చేస్తున్నట్లు అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు 2025, జనవరి ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించింది. కాగా, వీసాల కోసం నెలల తరబడి వేచిచూడాల్సిన అవసరం లేకుండా కొత్త నిబంధనలు ఉపయోగపడతాయని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా జారీ విధానాలను సరళీకరిస్తూ బైడెన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనల ప్రకారం వీసా అపాయింట్మెంట్ షెడ్యూల్, రీ షెడ్యూల్ మరింత సులభమవుతుందని అమెరికా కాన్సులేట్ వర్గాలు భావిస్తున్నాయి.