తెలంగాణలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో TSRTC మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీలో ప్రయాణం చేసేవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలనే నిబంధనలు విధించింది. డ్రైవర్, కండక్టర్‌తో పాటు ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని స్పష్టం చేసింది.
సరైన మాస్కు ఉంటేనే ప్రయాణికులను బస్సుల్లోకి అనుమతించాలని ఆర్టీసీ సిబ్బందికి ఎండీ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. మాస్క్ లేని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ బస్సుల్లోకి అనుమతించవద్దని స్పష్టం చేశారు. బస్సులో శానిటైజర్ అందుబాటులో ఉంచాలని సూచించారు. కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బస్టాండ్‌లో మైకుల ద్వారా ప్రకటిస్తుండాలని సజ్జనార్ సూచించారు. డిపోలకు వచ్చిన బస్సులను శుభ్రం చేస్తుండాలని ఆదేశించారు. బస్సుల్లో మాత్రమే కాకుండా బస్టాండ్ ఆవరణలోనూ ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని, బస్టాండ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఎండీ సజ్జనార్ ఆదేశించారు.