అమరావతి, ఆంధ్రప్రభ: రేషన్ కార్డుల సంఖ్య మరింత తగ్గించే దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించిన కొత్త నిబంధనలను కేంద్రం తెరపైకి తెచ్చింది. రేషన్ కార్డుదారుల్లో అనర్హుల ఏరివేతకు మరోసారి కేంద్రం సిద్ధమైంది. అర్హత లేని వారు వెంటనే కార్డులను సరెండర్ చేయాలని స్పష్టం చేసింది. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి కోత పడుతుందోనని కార్డుదారుల్లో టెన్షన్ మొదలైంది. రాష్టంలోని 26జిల్లాల్లో సుమారు 1.4కోట్ల తెల్ల కార్డులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ తాజా నిబంధనల నేపథ్యంలో వాటిలో ఎన్ని ఉంటాయో, ఊడుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. జాతీయ ఆహార భద్రతా చట్టం-2013ను అనుసరించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డులు జారీ చేశాయి. వీటిని పుడ్ సెక్యూరిటీ కార్డులని కూడా పిలుస్తారు. కరోనా నుంచి దారిద్య్ర రేఖకు దిగువన ఉండి… రేషన్ కార్డులో ఉన్న ఒక్కో లబ్ధిదారుడికి కేంద్ర ప్రభుత్వం ఐదు కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది నవంబరు వరకు పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో అధికారులను తప్పుదారి పట్టించి కొంత మంది రేషన్‌కార్డుల ద్వారా రేషన్‌తో పాటు మరికొన్ని ఉచితాలు పొందుతున్నారని కేంద్ర ప్రభుత్వం తెలుసుకుంది. అలాంటి వారు తక్షణం తమ కార్డులు సరెండర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఒకవేళ అనర్హులు కార్డులను సరెండర్ చేయకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా నిబంధనలు..
గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000 లోపు ఆదాయం ఉన్న వారు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు ఆదాయం ఉన్నవారే కార్డులకు అర్హులని తాజా నిబంధనల్లో పేర్కొన్నారు. మాగాణి భూములు 3.5 ఎకరాల్లోపు ఉన్నవారు, బీడు భూములైతే 7.5 ఎకరాల్లోపు ఉన్నవారు రేషన్ కార్డు తీసుకోవడానికి అర్హులని పొందుపర్చారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలలోపు , పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.15 వేలు ఆదాయం వచ్చేవారు అర్హులని పేర్కొన్నారు. వంద చదరపు మీటర్ల ఇల్లు, ఫ్లాట్ ఉన్నవారు, కారు, ట్రాక్టర్, గ్రామాల్లో రూ.1.5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం, పట్టణాల్లో రూ.2 లక్షల కంటే ఎక్కువ ఆదాయం, నగరాల్లో రూ.3 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే కార్డులు సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో సరెండర్ చేయాల్సి ఉంటుంది. ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇన్‌కంట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ చెల్లించని వారు మాత్రమే రేషన్‌కార్డు పొందడానికి అర్హులని తాజా నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు రేషన్‌కార్డులు పొందడానికి అనర్హులు. గతంలో రేషన్ కార్డు తీసుకున్నవారు ఎవరైనా ఆర్థికంగా స్థిరపడితే సరెండర్ చేయాల్సిందేనని చెబుతున్నారు..
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.