Friday, November 22, 2024

Cricket: టీ20లకు కొత్త రూల్‌.. స్లో ఓవర్ ​రేట్​ వేస్తే ఓ ఫీల్డర్ ఔట్..

టి20లకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కొత్త నిబంధలు పెట్టింది. టీ20 ఫార్మాట్ కు సంబంధించిన రూల్స్ ని శుక్రవారం ప్రకటించింది. మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ల కు పెనాల్టీని ప్రకటించింది. అలాగే మ్యాచ్ సమయంలో డ్రింక్స్ విరామం తీసుకోవాలని నిబంధన విధించింది. ఈ నిబంధనలు జనవరి 16న వెస్టిండీస్-ఐర్లాండ్ జట్ల మధ్య జరగబోయే మొదటి టీ20తో అమల్లోకి రానున్నట్టు తెలిపింది. ఈ కొత్త నిబంధనలతో టీ20 ఫార్మాట్ మరింత ఇంట్రస్ట్ గా మారనుంది.  టీ20 క్రికెట్​లో స్లో ఓవర్ రేట్ బౌలింగ్ చేస్తే.. ఫీల్డింగ్ చేసే జట్టుకు మ్యాచ్ జరుగుతుండగానే భారీ శిక్ష పడనుంది. ఫీల్డింగ్ చేసే జట్టు ఇన్నింగ్స్​ చివరి ఓవర్ మొదటి బంతిని నిర్ధేశిత సమయానికి వేయాలి. లేదంటే ఎన్ని ఓవర్​లు లేదా బంతులు మిగిలినా.. 30 యార్డ్ సర్కిల్​ వెలుపల ఉన్న ఫీల్డర్లలో ఒకరిని తగ్గించాల్సి ఉంటుంది. అంటే 30 యార్డ్ సర్కిల్ వెలుపల నలుగురిని మాత్రమే అనుమతిస్తారు. సాధారణంగా అయితే పవర్ ప్లే తర్వాత ఐదుగురు ఫీల్డర్లకు అనుమతి ఉంటుందన్న సంగతి తెలిసిందే. 

స్లో ఓవర్ రేట్ బౌలింగ్ చేస్తే.. ఫీల్డింగ్ చేసే జట్టుకు పెద్ద మైనస్‌గా మారుతుంది. బ్యాటర్లు స్వేచ్ఛగా భారీ షాట్లు ఆడడానికి వీలు ఉంటుంది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే ఫీల్డింగ్ చేసే జట్టు నిర్ణీత సమయం లోపల తమ ఓవర్లను పూర్తి చేయాల్సి ఉంటుంది. గతంలో స్లో ఓవర్ రేట్ వేస్తే ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కోత విధించేవారు. అయితే మ్యాచ్ ఫీజులు, వార్నింగ్‌లతో జట్ల తీరులో మార్పు రాకపోవడంతో ఐసీసీ ఈ కొత్త నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జనవరి 16న వెస్టిండీస్-ఐర్లాండ్ మధ్య జరగబోయే తొలి టీ20తో ఈ నిబంధన (స్లో ఓవర్ రేట్) అమల్లోకి వస్తుంది. అలాగే వెస్టిండీస్-దక్షిణాఫ్రికా మహిళా జట్ల మధ్య జనవరి 18నుంచి జరగబోయే టీ20 సిరీస్​ నుంచి మహిళల టీ20ల్లోనూ ఈ నిబంధనను అమలు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement