న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ది రెయిన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన తెలంగాణా క్యాడర్ ఐఏఎస్ అధికారి జి. అశోక్ కుమార్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగాకు డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఆయన న్యూడిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని తెలంగాణా భనన్ రెసిడెంట్ కమిషనర్‌గా పని చేసిన అశోక్ కుమార్ కేంద్ర సర్వీసుల్లో వివిధ హోదాల్లో పని చేశారు. గతంలో కేంద్ర పౌర విమానయాన శాఖలో జాయింట్ సెక్రటరీగా, విద్యుత్ శాఖలో డైరక్టర్‌గా, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగాలో ఎగ్జిక్యూటివ్ డైరక్టర్‌గా విధులు నిర్వర్తించారు.
నీటి రంగంలో విస్తృత అనుభవం కలిగిన అశోక్ కుమార్ క్యాచ్ ద రెయిన్ పేరుతో జలశక్తి అభియాన్‌లో చేపట్టిన కార్యక్రమాలకుగానూ ‘ది రెయిన్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పేరు గడించారు. దేశవ్యాప్తంగా 9.5 లక్షల వర్షపు నీటి సంరక్షణ పనులు మంజూరు చేయడానికి ఆయన కృషి చేశారు. వాటర్ టాక్స్, వాటర్ టెక్ టాక్స్ పేరుతో సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నీటి సంరక్షణ, పొదుపుగా నీటి వినియోగంపై పారిశ్రామిక, సాగునీటి రంగాల్లో అవగాహన కలిగించేందుకు విశేష కృషి చేశారు. పని చేసిన ప్రతీచోటా అశోక్ కుమార్ తనదైన ముద్ర వేసి పలు జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు.