రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేపు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేయనుంది. ప్రజాప్రతినిధులు జిల్లాలోని ఆయా చోట్ల లబ్ధిదారులకు రేషన్‌కార్డులను అందించి రూ. 14 కోట్ల విలువైన బియ్యాన్ని సైతం పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొత్త కార్డుల జారీతో రాష్ట్రవ్యాప్తంగా 8.65 లక్షల మంది లబ్ధిదారులకు అదనంగా 5,200 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఏడాదికి ఇందుకోసం ప్రభుత్వం రూ. 2,766 కోట్లను వెచ్చించనుంది.
లబ్ధిదారులకు ప్రస్తుతం నూతన కార్డు మంజూరు చేస్తున్నట్లుగా ధ్రువీకరణ పత్రం అందిస్తామన్నారు. ఆ తర్వాత త్వరలోనే ప్రత్యేక నమూనాతో కూడిన కార్డులను ముద్రించి ఇస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. పారదర్శకంగా ప్రక్రియ పూర్తిచేశామని, అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్‌కార్డు అందిస్తామని వెల్లడించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం ఆయన నూతన లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలు అందించనున్నారు. కాగా కొత్తగా కార్డు తీసుకున్న లబ్ధిదారులకు ఆగస్టు నుంచి రేషన్ బియ్యం అందించనున్నారు.
ఈ వార్త కూడా చదవండి: మంత్రి కేటీఆర్‌కు చురకలు అంటించిన వైఎస్ షర్మిల