Monday, September 23, 2024

New President – శ్రీ‌లంక‌లో అరుణోద‌యం! లంకేశుడిగా మార్క్సిస్టు లీడ‌ర్‌

నూతన అధ్యక్షుడిగా దిసనాయకే ఎన్నిక‌
అధ్య‌క్ష కార్యాల‌యంలో ప్ర‌మాణస్వీకారోత్స‌వం
ప్ర‌మాణం చేయించిన ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌యంత‌
24 ఏండ్ల త‌ర్వాత శ్రీ‌లంక‌లో క‌మ్యూనిస్టుల‌కు చాన్స్‌
అనుర‌కుమార‌కు అనూహ్యంగా పెరిగిన ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు
విద్యార్థి రాజ‌కీయాల నుంచి దేశాధ్య‌క్షుడి దాకా..
అవినీతి ర‌హిత స‌మాజ నిర్మాణ‌మే ల‌క్ష్యంగా ముందుకు
అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల్లోనూ వెల్లువెత్తుతున్న సంతోషం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్‌: శ్రీలంక నూత‌న అధ్యక్షుడిగా మార్క్సిస్ట్‌ నేత అనురకుమార దిసనాయకే (56) ఎన్నిక‌య్యారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దివాలా అంచున ఉన్న శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. శనివారం జరిగిన త్రిముఖ పోరులో ఓటర్లు దిస‌నాయ‌కేకు పట్టం కట్టారు. దీంతో శ్రీలంక తదుపరి అధ్యక్షునిగా సోమ‌వారం ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్ష కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దిసనాయకే చేత ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా, శనివారం జరిగిన ఎన్నికల్లో ప్రథమ ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఎవరికీ 50 శాతానికిపైగా ఓట్లు రాలేదు. దీంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించి ఈ ఫలితాన్ని ప్రకటించారు.

- Advertisement -

24 ఏండ్ల త‌ర్వాత క‌మ్యూనిస్టుల‌కు చాన్స్‌

దిస‌నాయకే మార్క్సిస్ట్‌ జనతా విముక్తి పెరమున పార్టీ నేత. మరికొన్ని పార్టీలతో కలిసి నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌ (ఎన్‌పీపీ) పేరుతో ఎన్నికల్లో పోటీ చేశారు. సమగి జన బలవేగయ (ఎస్‌జేబీ) నేత సాజిత్‌ ప్రేమదాసపై దిసనాయకే గెలిచారు. ఇక లంక‌కు 9వ అధ్యక్షుడిగా సోమ‌వారం ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు 24 ఏండ్ల త‌ర్వాత అధ్యక్ష పీఠంపై క‌మ్యూనిస్ట్ నాయ‌కుడు కూర్చోవడం విశేషం.ఈ ఎన్నికల్లో 22 జిల్లాల పరిధిలోని 13,400కి పైగా పోలింగ్ కేంద్రాల్లో 1.70 కోట్ల మంది ఓటర్లలో 75 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొత్తగా దేశాధ్యక్షుడిగా ఎన్నికైన దిసనాయకే ప్రభుత్వం.. శ్రీలంకకు ఐఎంఎఫ్ ఇచ్చిన 2.9 బిలియన్ డాలర్ల బెయిలవుట్ ప్యాకేజీ నిబంధనల్లో మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఓట్లు కురిపించిన నినాదం

గ‌త ఏడాది అంత‌ర్గత సంక్షోభంతో అట్టుడికిన శ్రీ‌లంక‌లో ప్రజలు మార్పు కోరుకున్నారు. 1980 త‌ర్వాత మ‌రోసారి క‌మ్యూనిస్ట్ పార్టీకి అవ‌కాశం ఇచ్చారు. అవినీతికి తావులేని ‘స్వచ్ఛమైన పాల‌న’ నినాదంతో ఎన్నిక‌ల్లో పోటీ ప‌డిన అనుర క‌మార ఓట‌ర్లను ఆక‌ర్షించారు. విక్రమ‌సింఘే పాల‌నలో గాడీ త‌ప్పిన ఆరోగ్యం, విద్యా, ర‌వాణా రంగాల‌పై ఆయ‌న విమ‌ర్శనాస్త్రాలు సంధించారు. ఇవ‌న్నీ అనుర కుమార‌ ప‌ట్ల ప్రజ‌ల్లో న‌మ్మకం క‌లిగించాయి.

విద్యార్థి రాజకీయాల నుంచి ఎదిగి..

శ్రీలంక రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన అనుర కుమార దిసనాయకే డిగ్రీ చదువుతున్నప్పుడు సోషలిస్ట్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌లో చేరి, విద్యార్థి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. 1987లో మార్క్సిస్ట్‌ ప్రభావిత జనతా విముక్తి పెరమున (జేవీపీ) పార్టీలో చేరారు. 2004లో శ్రీలంక ఫ్రీడమ్‌ పార్టీతో కలిసి జేఎన్‌పీ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. శ్రీలంకలో 2022లో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజల అసంతృప్తిని ఆయుధంగా మలచుకున్నారు. మార్పు, అవినీతి రహిత సమాజ నిర్మాణం వంటి నినాదాలతో జనాదరణ పొందారు. ఎన్నికల ప్రసంగాల్లో గత పాలకుల అవినీతి, వైఫల్యాల గురించి వివరించడంతోపాటు, దేశంలో జవాబుదారీతనం, వ్యవస్థాగత మార్పులు రావాలని గట్టిగా చెప్పారు. దిస‌నాయ‌కే అధ్య‌క్షుడిగా ఎన్నిక కావ‌డంతో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల్లో సంతోషం వెల్లివిరుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement