Tuesday, November 26, 2024

రెండేళ్లలో 16 కొత్త మెడికల్‌ కాలేజీలు.. అందుబాటులో వైద్య విద్య

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : డాక్టర్‌ కావాలనుకునే విద్యార్థుల కోరిక సులువుగా నెరవేరనుంది. రాష్ట్రంలో రానున్న రెండేళ్లలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య పెద్ద సంఖ్యలో పెరగనుంది. 2023-24 విద్యా సంవత్సరానికి 8 మెడికల్‌ కాలేజీలు, 2024-25 విద్యా సంవత్సరంలో మరో 8 నూతన మెడికల్‌ కాలేజీలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో మెడికల్‌ కాలేజీలో 150 ఎంబీబీఎస్‌ సీట్ల చొప్పున మొత్తం 2400 ఎంబీబీఎస్‌ సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి.

మంచిర్యాల, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, నాగర్‌కర్నూలు, జగిత్యాల, రామగుండం, వనపర్తిలో 2023-24 విద్యా సంవత్సరం నుంచే వైద్య తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ కళాశాలలకు అనుమతి కోసం జాతీయ మెడికల్‌ కమిషన్‌కు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకుంది.
ఈ ఏడాది డిసెంబర్‌లో ఎన్‌ఎంసీ బృందం రాష్ట్రంలో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్త మెడికల్‌ కాలేజీల్లో బోధనా, బోధనేతర సిబ్బందితోపాటు మౌలిక సదుపాయాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే వైద్య కళాశాలలకు అనుబంధంగా బోధనాస్పత్రులను కేటాయించింది. భవనాల ఎంపిక, కొన్నింటికి కొత్త భవనాల నిర్మాణం కూడా ప్రారంభమైంది.

తాజాగా… ఒక్కో మెడికల్‌ కాలేజీలో ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు మొత్తం కలిపి 15 మంది నియామకానికి వైద్య, ఆరోగ్యశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 28 కల్లా బోధనా సిబ్బంది నియామకం పూర్తి కానుంది. ఈ నెల 31న ఎంపికైన అభ్యర్థుల మెరిట్‌ జాబితాను ప్రకటించనున్నారు. నవంబర్‌ 7 కల్లా బోధనా సిబ్బంది కొత్త మెడికల్‌ కాలేజీల్లో విధుల్లో చేరాల్సి ఉంటుంది. మొత్తం 15 విభాగాల్లో బోధనా ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకం జరగనుంది.

కొత్త మెడికల్‌ కాలేజీ ల ఏర్పాటు పురోగతిపై త్వరలో సీఎం కేసీఆర్‌ సమీక్షించనున్నట్లు తెలిసింది. డిసెంబరులో కొత్త మెడికల్‌ కాలేజీల్లో మౌలిక వసతులను తనిఖీ చేసేందుకు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ బృందం రాష్ట్రానికి రానుండడంతో ఏర్పాట్లపై సీఎం కేసీఆర్‌ సమీక్షించనున్నట్లు తెలిసింది. అనుబంధ ఆస్పత్రుల కేటాయింపు, బోధనా, బోధనేతర సిబ్బంది నియామకంపై ఆయన ఆరా తీయనున్నారు.

వైద్య కళాశాలల్లో ఖాళీల వివరాలు సమర్పించండి.. రాష్ట్రాలకు ఎన్‌ఎంసీ లేఖ
దేశంలోని పలు వైద్య కళాశాలల్లోని వివిధ విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని తాజాగా నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) గుర్తించింది. ఈ విషయంలో రాష్ట్రాలకు ఘాటుగా లేఖ రాసింది. ఏళ్ల తరబడి వైద్య కళాశాలల్లో బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండడంతో వైద్య విద్యలో నాణ్యత కొరవడిందని అసంతృప్తి వ్యక్తం చేసింది. చాలా మెడికల్‌ కాలేజీల్లో అర్హత లేనివారిని కూడా కీలక వైద్య విభాగాధిపతులు, బోధనా సిబ్బందికి వినియోగించడాన్ని తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో వెంటనే ఖాళీగా ఉన్న విభాగాధిపతులు, బోధనా సిబ్బంది వివరాలు సమర్పించాలని వైద్య కళాశాలలను, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement