Friday, November 22, 2024

Big Story: సైబర్‌ నేరగాళ్ల‌ కొత్త ఎత్తులు.. డబ్బు కొట్టేసి ఈడీ కేసులంటూ బెదిరింపులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పోలీసుల ఎత్తులకు పై ఎత్తులను వేస్తున్న సైబర్‌ నేరగాళ్లు రోజుకో కొత్త తరహాలో, జిమ్మిక్కులతో అమాయక ప్రజలను, అత్యాశాపరులను మోసం చేస్తున్నారు. బాధితులు ప్రశ్నిస్తే తిరిగి వారినే బెదిరిస్తున్నారు. మీ మీద మనీ ల్యాండరింగ్‌ కేసులు పెట్టొచ్చు, మీ వివరాలన్నీ ఈడీ అధికారులకు ఇస్తే ఏ క్షణమైనా అరెస్టు చేస్తారని నకిలీ అరెస్ట్‌ వారెంట్లు పంపించి హెచ్చరిస్తున్నారు. బాధితులు భయపడి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయరని ఇలా ఎత్తుగడ పన్నుతున్నారు. కోటి రూపాయల లాభం వచ్చిందని నమ్మించి ఓ సివిల్‌ ఇంజనీర్‌ను ఇటీవల కొంతమంది సైబర్‌ కేటుగాళ్లు ఇన్వెస్ట్‌మెంట్స్‌ గ్రూపులో యాడ్‌ చేసి మోటివేట్‌ చేశారు. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించారు. అతడితో బిట్‌కాయిన్స్‌ పేరుతో పెట్టుబడి పెట్టించి తక్కువ సయయంలోనే అధిక లాభాలు వచ్చినట్లు వర్చువల్‌గా చూపించారు. వాటి ఆధారంగా మరింత పెట్టుబడి పెట్టించారు.

15 రోజుల్లో మొత్తం రూ. 20 లక్షలు పెట్టించారు. సుమారు కోటి లాభం వచ్చినట్లు చూపించారు. ఎంతో ఉత్సాహంగా వాటిని విత్‌డ్రా చేసుకుంటానని చెప్పగానే అప్పటి నుంచి బాధితుడికి అసలు సినిమా చూపించడం ప్రారంభించారు. నీ డబ్బులు ఇవ్వడం కుదరదు. అధిక లాభాలు వచ్చినట్లు నీ ఖాతా వివరాలన్నీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు తెలిసిపోయింది. మనీ ల్యాండరింగ్‌ కేసు కింద అరెస్టు వారెంట్‌ జారీ చేశారని నకిలీ అరెస్టు వారెంట్‌ను వాట్సాప్‌లో పోస్ట్‌ చేశారు. డబ్బుల విషయం మరచిపోవాలని లేకపోతే లీగల్‌గా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

దీంతో బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించి గోడు వెల్లబోసుకున్నాడు. ఇటీవల ఈ తరహా కేసులు వస్తున్నట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపారు. రూ. 60 లక్షలు పోగొట్టుకున్న ఓ సాప్ట్‌nవేర్‌ ఇంజనీర్‌కు, రూ. 35 లక్షలు పోగొట్టుకున్న మరో బాధితుడికి ఇవే బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇన్వెస్ట్‌మెంట్‌ సైబర్‌ మోసాల పట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement