మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం సరికొత్త ఫీచర్‌ని తీసుకొచ్చింది. మహిళా యూజర్ల సౌకర్యార్థం చాట్‌బాట్ సేవలు అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించింది. ప్రతి నెలా వచ్చే నెలసరిని తేలిగ్గా కనిపెట్టడానికి సిరోనా హైజెనీ అనే సంస్థతో కలిసి వాట్సాప్ ఈ సర్వీసును అందించనుంది. భారత్‌లో తొలిసారి ఈ సేవలు అందిస్తున్నామని తెలిపింది. ఈ చాట్బాట్లో నెలసరి ట్రాకింగ్, గర్భధారణ, గర్భధారణ నివారణ వంటి సేవలను వాట్సాప్ అందించనున్నట్టు పేర్కొంది.
అయితే.. మహిళలు తమ నెలసరి గురించి కొంత ప్రాథమిక సమాచారం దీంట్లో రిజిస్టర్ చేయాలి. అలా ఇచ్చిన డేటా ఆధారంగా చాట్‌బోట్ తన యూజర్లకు సరైన నెలసరి తేదీని తెలియజేస్తుందని వాట్సాప్తెలిపింది. ఈ సేవలు పొందడానికి యూజర్లు 919718866644 అనే మొబైల్ నంబర్‌కు హాయ్ అని మెసేజ్ పంపి.. తర్వాత చాట్‌బోట్ చూపే 3 ఆప్షన్లలో ఒకటి ఎంచువాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రాథమిక వివరాలు రిజిస్టర్ చేయాలి. దీని ద్వారా తమకు అవసరమైన సేవలు అందుకోవచ్చు. ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగమైన వాట్సాప్ ద్వారా మహిళల జీవన ప్రమాణాల మెరుగుదలకు కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు సిరోనా హైజేనీ తెలిపింది.