సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో మరో ప్రత్యేక విభాగం అందుబాటులోకి రానుంది. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించేందుకు ఎమర్జెన్సీ మెడికల్ డిపార్ట్‌మెంట్ (ఈఎండీ) పేరుతో కొత్త విభాగం ఏర్పాటు చేశారు. ఈ విభాగంలో ఆర్థో, అనస్తీషియా, గ్యాస్ర్టో, న్యూరో, యూరాలజీ, ట్రామా తదితర ముఖ్యమైన విభాగాల వైద్యులు అందుబాటులో ఉంటారు. 24/7 అన్ని విభాగాలకు చెందిన వైద్యులూ అందుబాటులో ఉంటారు. వచ్చే నెల ఒకటోవ తేదీన ఎమర్జెన్సీ మెడికల్ డిపార్ట్‌మెంట్ (ఈఎండీ)ని ప్రారంభిస్తున్నారు. ఈ మేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని క్వాజువాలిటీ వార్డుకు తీసుకొస్తే ఆర్థో, అనస్తీషియా వైద్యులకు ఫోన్ చేసి పిలిపించే వారు. దీంతో వైద్యం అందడంలో జాప్యం జరిగేది. ఇకపై అలాంటి పరిస్థితులు లేకుండా అన్ని విభాగాలకు చెందిన వైద్యులు ఈఎండీలో అందుబాటులో ఉంటారు. క్షణాల్లో అన్ని రకాల చికిత్సలూ ఇక్కడ లభిస్తాయి. ఈఎండీ విభాగంలో కార్పొరేట్ తరహాలో సేవలు అందుతాయి.