త్వరలోనే కొత్త కరెన్సీ నోట్లని ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని..అయితే వాటితో పాటు క్వీన్ ఎలిజబెత్ ముద్ర ఉన్న పాత నోట్లను కూడా కొన్నాళ్ల పాటు వాడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్…కాగా ఛార్లెస్ ముద్ర ఉన్న నాణాలను బ్రిటన్‌లోని రాయల్ మింట్ ప్రింట్ చేయనున్నారు. క్వీన్ ఎలిజబెత్ మరణంతో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కరెన్సీ నోట్లపై గందరగోళం నెలకొంది. రాణి ముద్ర ఉన్న ఆ నోట్లు చెలామణి అవుతాయో లేదో స్పష్టంగా తెలియడంలేదు. దాంతో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ దీనిపై ప్రకటన చేసింది. రాణి ఎలిజబెత్ ముద్ర ఉన్న నోట్లు, నాణాలు చెలామణి అవుతాయని సెప్టెంబర్ 9వ తేదీన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ప్రకటన చేసింది.
అయితే క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు పూర్తి అయిన ఏడు రోజుల తర్వాత కరెన్సీ నోట్లపై మరోసారి అధికారక ప్రకటన చేయనున్నట్లు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ తెలిపింది. సెప్టెంబర్ 19వ తేదీన ఎలిజబెత్ పార్దీవదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.కామన్‌వెల్త్‌లో మొత్తం 54 దేశాలు ఉన్నాయి. అయితే ఆ దేశాల్లో వాడుతున్న కరెన్సీ నోట్లపై క్వీన్ ముద్ర ఉంటోంది. అయితే బ్యాంక్ నోట్లను ప్రింట్ చేసే రాయల్ మింట్‌కు ఇప్పుడో పెద్ద టాస్క్ వచ్చి పడింది. రాణి బొమ్మ ఉన్న నోట్లను, నాణాలను తొలగించి వాటి స్థానంలో కింగ్ ఛార్లెస్-3 ముద్రతో నోట్లను, నాణాలను జారీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో సుమారు 4.7 మిలియన్ల బ్యాంక్ నోట్లు చెలామణిలో ఉన్నాయి. ఆ నోట్ల విలువ సుమారు 95 బిలియన్ల డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాయల్ మింట్ లెక్క ప్రకారం.. 29 మిలియన్ల నాణాలు కూడా చెలామణిలో ఉన్నాయి.