సైబర్ ఫ్రాడ్‌లో ఆ మూడు దేశాలే కీలకం
మయన్మార్, లావోస్, కంబోడియా నుంచి కాల్స్
డిజిటల్ అరెస్టు మోసాల్లో ₹120కోట్లు నష్టపోయిన భారతీయులు
ట్రేడింగ్, పెట్టుబడులు, డేటింగ్ యాప్‌లతోనూ వల
₹1,776 కోట్ల మోసం జరిగిందన్న కేంద్ర హోంశాఖ
ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తీయటి కబుర్లు
సోషల్ మీడియా, సోషల్ ఆప్స్ వేదికగా మోసాలు
జాగ్రత్తగా ఉండాలి.. హెచ్చరిస్తున్న పోలీసు అధికారులు
ఆంధ్రప్రభ స్మార్ట్, సెంట్రల్ డెస్క్: భారతీయులు డిజిటల్ అరెస్ట్ మోసాల ద్వారా ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ (మొదటి త్రైమాసికం) మధ్య ₹120.3 కోట్లను నష్టపోయారని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ట్రేడింగ్, పెట్టుబడులు, డేటింగ్ యాప్ వంటి మోసాలన్నీ కలిపితే ఆ మొత్తం ₹1,776కోట్లు వరకు ఉంటుందని తెలిపింది. సైబర్ నేరగాళ్లలో 46శాతం మంది మయన్మార్, లావోస్, కంబోడియాకు చెందినవారేనని నివేదికలో స్పష్టం చేసింది.
ఉపాధి పేరిట వల..
బాధితులు ట్రేడింగ్ స్కామ్‌లలో ₹1,420.48 కోట్లు, పెట్టుబడి మోసాలలో ₹222.58 కోట్లు, డేటింగ్ స్కామ్‌లలో ₹13.23 కోట్లు కోల్పోయారు. మయన్మార్, లావోస్, కంబోడియాకు చెందిన సైబర్ నేరగాళ్లు మోసపూరిత వ్యూహాలను ఉపయోగించి భారతీయులను టార్గెట్ చేస్తున్నారని ఇండియన్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఉపాధి అవకాశాలను ఇస్తామని సోషల్ మీడియా వేదికగా మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
పెద్ద ఎత్తున డిజిటల్ అరెస్టు ఫిర్యాదులు..
ఈ ఏడాది జనవరి 1, ఏప్రిల్ 30వ తేదీల మధ్య 7.4 లక్షల డిజిటల్ అరెస్ట్ ఫిర్యాదులు అందాయి. 2023లో 15.56 లక్షలు, 2022లో మొత్తం 9.66 లక్షలు, 2021లో 4.52 లక్షల ఫిర్యాదులు వచ్చాయి.
హెచ్చరించిన ప్రధాని మోదీ
సైబర్ నేరాలు పెరిగాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. ఈ మధ్య జరిగిన మన్‌కీ బాత్‌లో ఈ విషయాన్నే ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలాగే డిజిటల్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలన్నారు. రాష్ట్రాల సహకారంతో దర్యాప్తు సంస్థలు డిజిటల్ అరెస్టు నిర్మూలనపై అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. దర్యాప్తు సంస్థలేవీ ఫోన్లు, వీడియో కాల్స్ ద్వారా ప్రజలను సంప్రదించవని ప్రధాని చెప్పారు.
డిజిటల్ అరెస్టు అంటే ఏమిటి?
మీ పేరు మీద డ్రగ్స్, తప్పుడు పాస్‌పోర్టులు, నిషేధిత వస్తువులు వచ్చినట్టుగా చెబుతారు. ఒకవేళ మీరు అసలు ఎలాంటివి ఆర్డర్ పెట్టలేదని వారితో అరిచి చెప్పినా, వినరు. లేదు లేదు.. మీపేరు మీద ఆర్డర్ వచ్చింది కాబట్టి మీరే బాధ్యులు అవుతారని అంటారు. చట్టపరంగా చిక్కుల్లో పడతారని చెబుతారు. ఈ విషయాన్ని నమ్మేలా చేస్తారు. కేసు డీల్ చేసి సెటిల్మెంట్ చేసేందుకు డబ్బులు అడుగుతారు. దీన్నే డిజిటల్ అరెస్ట్ అంటారు. దీనికోసం సీబీఐ, కస్టమ్, ఈడీ అధికారుల పేరుతో నమ్మేలా వ్యవహరిస్తారు. యూనిఫాం ధరించి వీడియో కాల్ చేస్తుంటారు. కేసు మూసివేయడానికి డబ్బు డిమాండ్ చేస్తారు. ఇలాంటి ఫ్రాడ్ కాల్స్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోసాలభారిన పడొద్దని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.