బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో (BRAOU) కొత్తగా రెండు కోర్సులు ప్రవేశపెట్టనున్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో జాగ్రఫీ, ఇంటర్నేషనల్ స్టడీస్ కోర్సులను తీసుకురావాలని అధికారులు యోచిస్తున్నారు. బీఏ కోర్సులో భాగంగా వీటిని అందుబాటులోకి తేనున్నారు. సివిల్స్ సహా గ్రూప్-1 ఉద్యోగాలకు జాగ్రఫీ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఎక్కువగా ఉండడమే దీనికి కారణంగా తెలుస్తోంది. అందుకని ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే వారిని దృష్టిలో పెట్టుకొని జాగ్రఫీ సబ్జెక్టును అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది. వర్తమాన అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఇంటర్నేషనల్ స్టడీస్‌ను కూడా ప్రవేశపెట్టాలని అధికారులు నిర్ణయించారు.
ఆన్‌లైన్ కోర్సులు కూడా..
చాలా ఏళ్లుగా సంప్రదాయ కోర్సులను నిర్వహిస్తున్న అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ.. లేటెస్ట్‌గా ఆన్‌లైన్ కోర్సులను కూడా అమలు చేస్తోంది. ఇప్పటికే మేనేజ్‌మెంట్, జనరల్ స్టడీస్ కోర్సులను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చి టెలీ పాఠాలను ప్రసారం చేస్తోంది. వీటిని యూట్యూబ్ చానల్, మొబైల్ యాప్‌లలోనూ అందుబాటులోకి తేవాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు. సొంత పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ కోర్సులను అభ్యసించే అవకాశం కూడా ఉన్నది. అందువల్ల బీఆర్‌ఏవోయూలో ప్రవేశపెట్టే కొత్త కోర్సులను సైతం సొంత పోర్టల్‌తో అనుసంధానించనున్నారు. ఆయా కోర్సులకు క్రెడిట్స్‌ను జారీచేసి, అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ఏబీసీ)తో అనుసంధానించనున్నట్టు అధికారులు తెలిపారు.