ఇది ఓ ఆటో డ్రైవర్ సాధించిన విజయమనే చెప్పాలి. తమిళనాడు తంజావూరు జిల్లా కుంభకోణం పట్టణంలో శరవణన్ ఆటో డ్రైవర్ గా గత 20ఏళ్ళ నుంచి జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఆయన వయస్సు 42ఏళ్లు. కాగా ఇటీవల తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో 17వ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేశారు. పోలింగ్‌లో మొత్తం 2,100 ఓట్లకు గాను 964 ఓట్లు సాధించి విజేతగా నిలిచారు. తమిళనాడులో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో డీఎంకే విజయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ పార్టీ 21 కార్పొరేషన్లలో 20 కార్పొరేషన్లకు మేయర్లను ఎంపిక చేసింది. ఒక్క కార్పొరేషన్ మేయర్ పదవిని కాంగ్రెస్ కు కేటాయించింది. అదే కొత్తగా ఏర్పడిన కుంభకోణం మున్సిపల్ కార్పొరేషన్. అయితే ఆ పదవిని ఓ సీనియర్ లీడర్ అప్పగిస్తారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ హైకమాండ్ శరవణన్‌ను ఆ పదవికి ఎంపిక చేసింది. దీంతో చాలా మంది కాంగ్రెస్ ప్రముఖులు ఆయనను ట్విట్టర్ లో అభినందించారు. నిరాడంబరమైన నేపథ్యం నుంచి అభ్యర్థిని ఎంపిక చేసినందుకు పార్టీని కొనియాడారు. ఆయన ఎంపికైన తీరు, ఆ సమయంలో ఆయన పొందిన అనుభూతిని ఆయన ఓ మీడియా సంస్థతో పంచుకున్నారు.
కాంగ్రెస్ లో చాలా మంది సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఉండటంతో ఈ విషయం నేను అస్సలు ఊహించలేదన్నారు. నేను కేవలం ఆటోడ్రైవర్‌నేని. కానీ మా నాయకుడు నాకు మేయర్ అయ్యే లక్షణాలు ఉన్నాయని చెప్పారు. పార్టీ నన్ను అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. తరువాత మా రాష్ట్ర అధ్యక్షుడు కెఎస్ అళగిరి నన్ను అభినందించారు. దీంతో పాటు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ నుండి నాకు కాల్ వచ్చింది. జీవనోపాధి కోసం నిజంగా ఆటో నడుపుతున్నావా అని నన్ను ప్రశ్నించారు. దానికి నేను అవునని సామాధానం ఇచ్చాను. నాకు అవకాశం కల్పించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్ల కంటే కుంభకోణాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని సూచించారు. నా నామినేషన్ పట్ల రాహుల్ జీ (రాహుల్ గాంధీ) కూడా సంతోషంగా ఉన్నారని మా నాయకులు నాకు చెప్పారని శరవరణ్ వెల్లడించారు.
శరవణన్ తన భార్య దేవి, ముగ్గురు పిల్లలతో కలిసి తుక్కంపాళయంలో అద్దె ఇంట్లో ఉంటూ రెండు దశాబ్దాలుగా ఆటోరిక్షా నడుపుతున్నాడు. కుంభకోణంలోని ప్రతి సందు తనకు తెలుసని, దీంతో నగరంలోని మొత్తం 48 వార్డుల ప్రజలతో పరిచయం ఏర్పడిందని చెప్పారు. ఏడేళ్ల కిందట సొంతంగా ఆటోరిక్షా కొని దానిపై ఆధారపడి జీవిస్తున్నాడు. అందరి మాదిరిగానే తన ఆదాయాన్ని కూడా కరోనా మహమ్మారి తీవ్రంగా దెబ్బతీసిందని ఆయన తెలిపారు. వార్డు సభ్యుల సహాయంతోనే తాను కౌన్సిలర్ పదవికి నామినేషన్ దాఖలు చేయగలిగానన్నాడు.కుంభకోణం కార్పొరేషన్ మేయర్ గా ఆయన ఎంపికైనప్పటికీ ఓ సాధారణ ఆటో డ్రైవర్ గానే ప్రమాణ స్వీకారానికి వచ్చారు. 20 ఏళ్ల పాటు నడిపిన ఆటోనే డ్రైవ్ చేస్తూ ప్రమాణ స్వీకార ప్రాంగణానికి వచ్చారు. దీంతో ఆయన సింప్లిసిటీని అందరూ అభినందించారు. ప్రజలు నాకు చాలా సహాయం చేశారు. ఈ ఎన్నికల్లో గెలవడానికి వారు నాకు సహాయం చేసారు. వీలైనప్పుడల్లా నేను వారిని కలుస్తూనే ఉంటాను అని ఆయన చెప్పారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేయడం, దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, తాగునీటి సరఫరా, వీధి దీపాలు మొదలైన ప్రాథమిక సౌకర్యాలపై దృష్టి పెట్టడం ప్రస్తుతం తన ముందున్న లక్ష్యాలని చెప్పారు.