తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సికింద్రాబాద్ ఎంపీ జి.కిషన్ రెడ్డికి కేంద్ర కేబినెట్లో చోటు లభించింది. కిషన్‌రెడ్డికి మంత్రి పదవి లభిస్తే తెలంగాణకు బీజేపీ కొత్త సారథి ఎంపిక ఉంటుందనేది భావనతో ప్రయత్నాలు ప్రారంభించారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, మెదక్ ఎంపీ రఘునందన్ తదితరులు ఈ పదవి కోసం గత కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అటు కేంద్ర కేబినెట్లో చోటు కోసం, అలాగే ఇటు బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఆశిస్తూ పైరవీలు చేస్తున్నారు.
ఈటెలకే అధిష్టానం మొగ్గు
బీజేపీ రథ సారథి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు ఇవ్వడానికి అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు ఆ పార్టీలో చర్చజరుగుతుంది. ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాతో ఆయన సమావేశం కానున్నారు. ఆ తర్వాత భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటలను నియమిస్తూ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలిసింది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఈటలకి ఉన్న విస్తృత పరిచయాలు, మంత్రిగా పనిచేసిన అనుభవం, సమర్ధవంతమైన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఈ ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని అధిష్టానం పరిశీలనకు తీసుకున్నట్లు తెలిసింది.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో…
తెలంగాణ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పార్టీ పుంజుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ మరింత బలోపేతం కావడానికి స్థానిక సంస్థల ఎన్నికలు వేదికగా తీసుకోవాలి. ఇదే సమయంలో పార్టీ సారథిగా సమర్థవంత నాయకుడు అవసరమని బీజేపీ అధిష్టానం గుర్తించింది. పార్టీ పదవి కోసం ఆశిస్తున్న వారిలో ఉద్యమ చరిత్ర గల ఉన్న నేతల్లో ఈటెల రాజేందర్ కు మంచి గుర్తింపు ఉంది. కనుక ఆయన వైపు అధిష్టనం మొగ్గు చూపుతున్నట్లు ఉంది.