హుజురాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ విజయం సాధించడంతో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు తల నొప్పి మొదలైంది. ఎన్నికలకు ముందు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపుపై ఉన్న ధీమాతో చేసిన సవాల్ ఇందుకు కారణమైంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఓ డిబేట్‌లో ఆయన సవాల్ చేశారు. ఇప్పుడు ఇదే మాట ఆయనను ఇరకాటంలో పడేసింది. రాజీనామా ఎప్పుడు చేస్తారు? అంటూ ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
హుజురాబాద్ ఎన్నిక జరిగే వరకు అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. టీవీ చానాళ్ల వేదికగా సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకున్నారు. ఈ క్రమంలో హుజూరాబాద్‌లో ఎట్టిపరిస్థితుల్లో టీఆర్‌ఎస్ గెలుస్తుందని, గెల్లు శ్రీనివాస్ విజయం తథ్యమని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ ఓ టీవీ చానల్ డిబెట్‌లో ఢంకా బజాయించి చెప్పారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు కనీసం డిపాజిట్ కూడా రాదన్నారు. ఒకవేళ ఈటల రాజేందర్ గెలిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వెల్లడి కావడం, ఈటల చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ఓడిపోవడం జరిగిపోయాయి. దీంతో ఇప్పుడు నెటిజన్లు ఎమ్మెల్యే గవ్వల బాలరాజును టార్గెట్ చేశారు. ఈటల తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకోవడంతో.. సవాల్ చేసిన గువ్వలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఈటల విజయం సాధించడంతో గువ్వల మాట మీద నిలబడాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మరికొందరైతే ఆయనకే నేరుగా ఫోన్ చేసి ఎప్పుడు రాజీనామా చేస్తున్నావని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆయనకు కొత్త తలనొప్పులు మొదలైంది. ఒకవేళ ఇచ్చిన మాటకు కట్టుబడి రాజీనామా చేస్తే అచ్చంపేట నియోజకవర్గానికి మరోసారి ఉపఎన్నిక నిర్వహించాల్సి వస్తుంది. మరి గవ్వల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? లేక లైట్ తీసుకుంటారా? అన్నది చూడాలి.
ఇది కూడా చదవండి: తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: జేపీ నడ్డాతో ఈటల