తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గిందా? వైరస్ కట్టడికి అమలు చేస్తున్న లాక్ డౌన్ సత్ఫలితాలు ఇస్తుందా? ఈ విషయాలు పక్కన బెడితే కరోనా రోగులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు మాత్రం కిటకిటలాడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు రాష్ట్రలోని ఆస్పత్రిల్లో బెడ్లు దొరకని పరిస్థితి కనిపించింది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో బెడ్లన్నీ నిండిపోయాయి. పాజిటివ్ వచ్చిన రోగులు చికిత్స కోసం కార్పోరేట్ హాస్పిటల్స్‌కి క్యూ కడుతుండటంతో వెయిటింగ్ లిస్టులు పెగింది. బెడ్ ఖాళీ అయితే కేవలం క్షణాల్లోనే మరో పేషెంట్ అడ్మిట్ అవుతున్నాడు. దీంతో చాలా ఆస్పత్రులు వచ్చిన వారందరినీ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తుండగా.. కొన్ని హాస్పిటల్స్ మాత్రం కొత్త రోగులను చేర్చుకునేందుకు నిరాకరిస్తున్నాయి.
అయితే కొన్ని కార్పోరేట్లు ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని దోపిడీకి పాల్పడుతున్నాయి. ప్రభుత్వ టారిఫ్‌కు కాకుండా ఆస్పత్రులు వేసే బిల్లు చెల్లించేందుకు ఒప్పుకొంటున్న వారినే చేర్చుకుంటున్నారు. మిగిలిన వారిని బెడ్లు ఖాళీ లేవంటూ తిప్పి పంపుతున్నారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న రోగులకు రోజుకు రూ.50 వేల వరకు చార్జి చేస్తున్నారు. బెడ్లు దొరకడమే కష్టంగా ఉన్న నేపథ్యంలో రోగుల కుటుంబసభ్యులు అడిగినంత బిల్లు చెల్లించాల్సి వస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పర్యవేక్షణ లేక ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజలను పీల్చిపిప్పిచేస్తున్నాయి. ప్రాణాలు కాపాడాలని హాస్పిటల్ కి వచ్చే బాధితులకు లక్షల్లో బిల్లులు వేస్తున్నాయి. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా దాదాపు అన్ని ఆస్పత్రులు ఇద తంతుతో వ్యవహరిస్తున్నాయి. చికిత్స పొందుతూ కరోనా బాధితులు మృతి చెందితే వారి మృతదేహాలు కూడా ఇవ్వని పరిస్థితి కనిపించిన సంగతి తెసిందే.
అయితే, ఈ విషయంలో టాస్క్‌ఫోర్స్ చైర్మన్, తెలంగాణ మంత్రి కేటీఆర్ చర్యలు తీసుకోకపోవడం సర్వత్ర చర్చనీయాంశమైంది. కేటీఆర్ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తరుచు ASKKTR అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. అంతేకాదు ఎవరైనా తమ సమస్యను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లితే.. వెంటనే పరిష్కరించేందుకు చర్యలు కూడా తీసుకుంటారు. కరోనా చికిత్సకు కావాల్సిన అత్యవసర మందులు, ఆస్పత్రుల్లో బెడ్లు లేక ఇబ్బంది పడుతున్న వారి సమస్యలు ట్విట్టర్ వేదికగానే ఆయన పరిష్కరించారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే, కార్పొరేట్ ఆస్పత్రులు వసూలు చేస్తున్న బిల్లులపై నెటిజన్లు చేసే ఫిర్యాదులపై మాత్రం కేటీఆర్ చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంత మంది కేటీఆర్‌ను ట్యాగ్ చేసినా ఆయన దృష్టికే వెళ్లడం లేదు. ఆస్పత్రులు వేసిన బిల్లులని చెల్లించలేక వందలాది మంది పడుతున్న వేదన, కార్పొరేట్ దోపిడి నుంచి కాపాడాలని ఆర్తనాదాలు చేస్తున్నా వారి అభ్యర్థనపై మాత్రం కేటీఆర్ దృష్టికి పెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమస్య ఏదైనా ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించే కేటీఆర్… ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై ఫిర్యాదు చేస్తుంటే మాత్రం స్పందించండం లేదని నెటిజన్లు అంటున్నారు.