కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ప్రపంచాన్ని వణికిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్.. ఇప్పుడు 60కి పైగా దేశాలకు పాకింది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఈ నేపథ్యలో ఇప్పటికే పలు దేశాలు ఆంక్షలు విధించాయి. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల వేళ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ నేపథ్యంలో నెదర్లాండ్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి లాక్ డౌన్ ప్రకటించింది. జనవరి 14 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని ప్రధానమంత్రి మార్క్ రూటే తెలిపారు. కల్చరల్, ఎంటర్ టైన్ మెంట్ ఈవెంట్స్ అన్నీ బంద్ చేయాలని ఆదేశాలిచ్చారు. జనవరి 9 వరకు స్కూళ్లు మూసి ఉంచాలని చెప్పారు.
జనవరి రెండో వారం వరకు యూరప్ లో కేసుల తీవ్రత భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. బ్రిటన్ లోనూ కేసులు పెరుగుతుండటంతో ఆంక్షలపై ఆలోచిస్తున్నారు. త్వరలోనే లాక్ డౌన్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు బ్రిటన్ లో కేసులు పెరగడంతో దాన్ని హై రిస్క్ దేశాల జాబితాలో చేర్చినట్టు జర్మనీ ప్రకటించింది. బ్రిటన్ నుంచి వచ్చే వారికి ఎయిర్ పోర్టుల్లో పర్ ఫెక్ట్ స్క్రీనింగ్ చేయాలని ఆదేశించింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా.. రెండు వారాల పాటు క్వారంటైన్ లో ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital