Monday, November 25, 2024

నేతాజీ అస్థికలను భారత్‌కు తీసుకురావాలి.. చితాభస్మాన్ని ఎర్రకోటలో ఉంచాలి: పవన్‌ కళ్యాణ్‌

హైదరాబాద్‌ ఆంధ్రప్రభ : టోక్యోలోని రెంకోజీ ఆలయంలో ఉన్న నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అస్థికలను భారత్‌కు తీసుకురావాలని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో గురువారం జరిగిన ‘నేతాజీ గ్రంథ సమీక్ష’ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పవన్‌ కళ్యాణ్‌, ఆంధ్రప్రభ ఎడిటర్‌ వైఎస్‌ఆర్‌.శర్మ, పుస్తక రచయిత ఎంవిఆర్‌.శాస్త్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ ఎంతో మంది పాలకులు మారుతున్నా గానీ, నేటికీ నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ చితాభస్మాన్ని ఎందుకు తేలేకపోతున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. నేతాజీ అస్థికలను తెచ్చి ఎర్రకోటలో ఉంచాలన్నారు. ప్రజలు దీనికి సహకరించాలని, ఆస్థికలను తెచ్చేంత వరకూ ప్రజా ఉద్యమాన్ని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకు నాయకులపై ఒత్తిడి తీసుకొస్తే ఇది సాధ్యమవుతోందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన అస్థికలు తేవాలని డిమాండ్‌ చేస్తూ రింకోజ్‌ టు రెడ్‌ ఫోర్ట్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను ఆవిష్కరించారు. నేతాజీ సేవలను ఈ దేశం సరిగా గుర్తించలేదన్నారు. నిన్నకాక మొన్న వచ్చిన వారికి శిలా ఫలకాలు, విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు.

దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్య్ర సమరయోధుల సేవలను స్మరించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. కనీసం వంద రూపాయల నోటుపైన అయినా నేతాజీ బొమ్మ ఉండేలా ముద్రించాలని ఆయన డిమాండ్‌ చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మహోన్నత వ్యక్తులను స్మరించుకోకుంటే ఈ దేశంలో మనకు ఉండే అర్హతలేదన్నారు. జైహింద్‌ నినాదాన్ని మొదట తీసుకొచ్చింది నేతాజీనే అని ఆయన కొనియాడారు. స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలో సుభాష్‌ చంద్రబోస్‌ను చాలా మంది విభేదించారని ఆయన చెప్పారు. నేతాజీ సైన్యంలో 70 శాతం మంది దక్షిణ భారత దేశానికి చెందినవారే ఉన్నారన్నారు. సుభాష్‌ చంద్రబోస్‌ చనిపోయే చివరి క్షణం వరకూ దేశ స్వాతంత్య్రం కోసం పరితపించిన అంశాన్ని ఆయన చదివి వినిపించారు. రెంకోజీ ఆలయంలోని విజిటర్స్‌ పుస్తకంలో ఏదోక రోజు నేతాజీ అస్థికలు భారత్‌కు తీసుకొస్తామని నాటి ప్రధాని వాజ్‌పేయి అందులో రాసిన విషయాన్ని పవన్‌ గుర్తుచేశారు.

నేతాజీ చనిపోయి 77 ఏళ్లు గడుస్తున్నా ఆయన అస్థికలను డీఎన్‌ఏ టెస్టు చేసి ఎందుకు స్వదేశానికి తీసుకురావట్లేదని ఆయన ప్రశ్నించారు. ప్రజలు కోరుకుంటే ఇది సాధ్యమవుతుందని, ఆ ఉద్యమాన్ని హైదరాబాద్‌ నుంచే ప్రారంభించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. కోటి రూపాయలు చూస్తే కలగని తృప్తి గ్రంథాలయాన్ని చూస్తే కలుగుతుందని పుస్తకాల మీద తనకున్న ఇష్టాన్ని ఆయన ఈసందర్భంగా చెప్పారు. తనని సీఎంను చేయమని, తన సినిమాలు చూడమని కోరడంలేదని, నేతాజీ అస్థికలు తెచ్చేందుకు మద్దతు కావాలని ఆయన ప్రజలను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement